హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. రాజ్యసభ సభ్యత్వానికి కాంగ్రెసు అభ్యర్థిగా తాను సీటు ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా సిఎంను కోరానని చెప్పారు. ముఖ్యమంత్రి అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాగా వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా రాజ్యసభ కోసం తన వంతు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ అధిష్టానాన్ని కలిసి రాజ్యసభ సీటును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను రాజ్యసభ అడిగేందుకే వచ్చానని మీడియాతో చెప్పారు.
కాగా కడప ఉపఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై ఆయన పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసే ముందు ఆయన మంత్రి పదవికి, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీలో ఆయనకు ఏ పదవి లభించలేదు. దీంతో ఆయన జిల్లాలో పార్టీని కాపాడుకునేందుకు తనకు పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. తాను కార్యకర్తల కోసమే పదవి ఆశిస్తున్నట్టు ఢిల్లీలో చెప్పారు.