అసెంబ్లీ వద్ద టిడిపికి చుక్కెదురు, చంద్రబాబు ఆగ్రహం
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: అసెంబ్లీ వద్ద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సోమవారం చుక్కెదురయింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గేటు-2 ద్వారా పాదయాత్రగా లోపలకు వస్తుండగా భద్రతా సిబ్బంది వారి చేతుల్లో ఉన్న ఫైళ్లను, ప్లకార్డులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారు. వీటిని లోనికి తీసుకు వెళ్లనిచ్చేది లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు భద్రతా సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది తమ ఎమ్మెల్యేల చేతుల్లో నుండి ఫైళ్లు, ప్లకార్డులు తీసుకుంటున్నారని తెలిసిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పద్ధతి సరిగా లేదంటూ మండిపడ్డారు. లోనికి తీసుకు వెళ్లనివ్వాలని చెప్పారు. అయినప్పటికీ భద్రతా సిబ్బంది ప్లకార్డులు తీసుకునే ప్రయత్నాలు చేశారు. దీనిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫిర్యాదు చేయాలని టిడిపి భావిస్తోంది.
కాగా సోమవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. మద్యం సిండికేట్లపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం పార్టీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. కాగా అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.