హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం పార్టీ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడింది. మద్యం సిండికేట్లపై చర్చ జరగాలని టిడిపి సభలో పట్టుబట్టింది. దీంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. టిడిపి ఎమ్మెల్యేలు మద్యం సిండికేట్లపై చర్చ జరపాలంటూ గన్ పార్కు వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్బంగా టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఫైర్ అయ్యారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ మద్యం అక్రమాలు ఒప్పుకున్నారని అయినప్పటికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలవడం లేదన్నారు. ప్రభుత్వం అధికారులను జైళ్లో పెట్టి మంత్రులను మాత్రం వదిలేసిందని ఆరోపించారు. మంత్రులపై చర్యలు తీసుకుంటే తన పదవి పోతుందనే భయంతోనే ఆయన మౌనంగా ఉన్నారన్నారు. కిరణ్ కు సిఎంగా కొనసాగే హక్కు లేదన్నారు. సభలో మద్యం అవినీతిపై చర్చ జరుగుతుంటే బొత్స దొంగలా లాబీల్లో తిరిగారని ధ్వజమెత్తారు.
మంత్రులతో మద్యం వ్యాపారం చేయించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముడుపులు అందజేస్తున్నారని ఆరోపించారు. మద్యంపై ఎసిబి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులే ఇప్పటి కేబినెట్లో ఉన్నారన్నారు. వైయస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయించాలన్నారు. ఎసిబి రిపోర్టు వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా ఆ తర్వాత టిడిపి నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. సభ సజావుగా నడిచేందుకు సహకరించారని వారిని కోరారు. మద్యం కుంభకోణంపై చర్చించేందుకు తమకు తక్కువ అవకాశం ఇచ్చారని టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. చర్చ జరగాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.