హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి తమ అభ్యర్థిని నిలబెట్టదని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం జోస్యం చెప్పారు. దీనిపై జెసి స్పందించారు. టిఆర్ఎస్ పోటీ పెట్టదని చెప్పారు. ఒకవేళ అభ్యర్థిని పెట్టినా తాము స్వాగతిస్తామని చెప్పారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే సమావేశాలకు వెళ్లాలని అనిపించడం లేదని అన్నారు. కెసిఆర్ సీమాంధ్రలో ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చునని చెప్పారు. కెసిఆర్ సీమాంధ్రలో సభ పెట్టి మాట్లాడినా తమకు అభ్యంతరం లేదన్నారు. తాడిపత్రిలో సభ పెడతానంటే తాను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. మైకు, స్టేజ్ అన్ని అరెంజ్ చేస్తానన్నారు. కెసిఆర్‌ను అక్కడకు ఆహ్వానిస్తానని చెప్పారు.
కాగా కోవూరు స్థానంలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆంధ్రవాళ్లు తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు తాము సీమాంధ్రలో ఎందుకు పోటీ చేయకూడదని ఆయన అడిగారు. మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయని, ఒకరి పేరు ఖరారు చేసి బి - ఫారం ఇస్తామని ఆయన చెప్పారు. తాను కోవూరులో ప్రచారానికి కూడా వెళ్తానని ఆయన చెప్పారు.