గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనపై వ్యతిరేకతతోనే మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు సీటు ఇప్పించారని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సోమవారం ఆరోపించారు. తనపై ఉన్న కక్ష కారణంగానే వైయస్సార్ పట్టుబట్టి అలా చేశారని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ ఏజెంటును కాదని కన్నానే టిడిపి ఏజెండ్ అన్నారు. నేను అల్పసంఖ్యాకవర్గ మహిళను ఓడించలేదన్నారు. టిడిపితో కన్నా లాలూచీ పడ్డారన్నారు. ఆయన ముఖ్య అనుచరుడు సూరిబాబు గుంటూరును నాశనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
కన్నా లక్ష్మీ నారాయణ ఇన్నేళ్లుగా పెదకూరపాడుకు చేసింది ఏమీ లేదన్నారు. నాలుగుసార్లు అక్కడ నుండి గెలిచిన కన్నా ఓడిపోతానని తెలిసే 2009 ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గానికి మారారని విమర్శించారు. కన్నా లక్ష్మీ నారాయణకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. కాగా గుంటూరు జిల్లాలో ఎంపి రాయపాటి సాంబశివ రావు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మధ్య ఎప్పటి నుండో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.