వైద్య ఉద్యోగాల విషయంలో శుభవార్త... ఆ పోస్టుల భర్తీలో కీలక ముందడుగు!
తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి కీలక అడుగులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న నర్సుల దినోత్సవం నాడు 1919మంది నర్సులకు నియామకపత్రాలు ఇచ్చారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఇక తాజాగా మరో శుభవార్త వైద్యారోగ్య శాఖ నుండి వచ్చింది.
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందడుగు
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మొత్తం 1,931 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ ఎంపిక జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో ఈ ప్రకటన సంతోషం నింపింది.

నియామకాలపై ప్రొవిజనల్ జాబితా
ఈ నియామకాల కోసం మొత్తం 24,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 20,600 మంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) కు హాజరయ్యారు. పరీక్షలో సాధించిన మార్కులతో పాటు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ప్రొవిజనల్ జాబితాను సిద్ధం చేశారు.
అభ్యంతరాలు ఉంటే ఆన్ లైన్ లో నమోదు
హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ సేవలకు ఇచ్చే వెయిటేజ్‌ను 30 మార్కుల నుంచి 20 మార్కులకు పరిమితం చేసిన విషయం గమనార్హం. దీంతో కొత్త విధానంలో అభ్యర్థుల మెరిట్ జాబితా రూపొందించబడింది. అభ్యర్థులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 18 నుంచి మే 22 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
నియామకాలపై బోర్డు స్పష్టత
అభ్యంతరాలు ఒక్కసారి మాత్రమే స్వీకరించబడతాయని, అందువల్ల అవసరమైన అన్ని పత్రాలను ఒకే PDF రూపంలో అప్‌లోడ్ చేయాలని సూచించారు. మొత్తం పోస్టుల్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,666 పోస్టులు ఉండగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 265 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ నియామకాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications