హైదరాబాద్: త్వరలో కాంగ్రెసులో అంతర్గత విభేదాలు మరింత ఎక్కువగా బయటపడతాయని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పి.శంకర రావు శుక్రవారం అన్నారు. కాంగ్రెసు పార్టీలో అంతర్గత విభేదాలు ప్రస్తుతం పెద్ద విషయం కాదన్నారు. ఈ నెల 21 మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత అసలు విభేదాలు బయటకు వస్తాయన్నారు. తెలంగాణ ప్రాంతంలోని ఆరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు 21న వస్తాయని చెప్పారు. అప్పుడు వందేళ్లలో ఎప్పుడూ చూడని విభేదాలు కాంగ్రెసులో బయట పడతాయని అన్నారు. కాంగ్రెసులో కలకలం మాత్రం ఖాయమన్నారు.
మంత్రి పదవి లేకపోవడం వల్ల తాను చాలా ఫ్రీగా ఉన్నానని చెప్పారు. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు ఏవైనా పెదబాబు చినబాబు మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని చెప్పారు. సత్తిబాబు, బందరు బాబులు ఎన్నికల్లో ఫట్ అవుతారని అన్నారు. కాగా పెదబాబుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, చినబాబుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని శంకర రావు గురువారం పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చెప్పిన సత్తిబాబు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అని అర్థమవుతోంది. ఇక బందరు బాబు అంటే తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అని భావిస్తున్నారు.