హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆయన మేనల్లుడు ఉమేష్ రావు శుక్రవారం సవాల్ విసిరారు. కెసిఆర్ అక్రమాలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. రాజకీయ పార్టీ కలాపాల కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కెసిఆర్ మాత్రం తెలంగాణ భవనాన్ని వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ కార్యాలయం నుండే కెసిఆర్ టివి ఛానల్ నడుపుతున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాలు, కుటుంబ సభ్యుల స్వార్థం కోసం కెసిఆర్ తెలంగాణను అడ్డు పెట్టుకున్నారని విమర్శించారు. ఆయనకు చాలా మంది బినామీలు ఉన్నారన్నారు. టి న్యూస్‌లో కెసిఆర్ బినామీలు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఒరిగేదేమీ లేదన్నారు.
గల్లీ పార్టీలతో తెలంగాణ రాదని ఢిల్లీ పార్టీలతోనే తెలంగాణ సాధ్యమన్నారు. కెసిఆర్ అక్రమాలపై మరిన్ని విషయాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. తెలంగాణ భవనంలో నిర్వహిస్తున్న న్యూస్ ఛానల్‌ను వెంటనే అక్కడి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోకపోతే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. అన్నీ తెలిసిన కెసిఆర్ చట్టాలను ఉల్లంఘించి పార్టీ కార్యాలయంలో టివి ఛానల్ నిర్వహించడమేమిటన్నారు. టిఆర్ఎస్ భవనంలో ట్రస్టు సభ్యులు ఎవరెవరో ధైర్యముంటే బయట పెట్టాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు.