హైదరాబాద్/వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కై తనను జైల్లో పెట్టించాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం వరంగల్ జిల్లాలో అన్నారు. ఎస్సైపై దౌర్జన్యం కేసులో అరెస్టైన ఎర్రబెల్లికి బుధవారం బెయిల్ దొరికింది. ఆయన జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ పేరుతో లూటీకి పాల్పడుతున్న తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆయన కుటుంబాన్ని జైలులో పెట్టాలన్నారు. కోర్టు ఆవరణలో తెరాస అడ్వోకేట్లు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఇప్పటికైనా వారు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నకిలీ పాసుపోర్టులు అమ్ముకొని రాజకీయంగా ఎదిగిన కెసిఆర్ తెలంగాణను మోసం చేస్తున్నారన్నారు. కొందరు న్యాయవాదులు న్యాయవ్యవస్థకు మచ్చతెచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. నలుగురు న్యాయవాదులపై వేసిన సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలన్నారు.
సకల జనుల సమ్మె సమయంలో కెసిఆర్ ఒక్కరే కేంద్రం వద్దకు ఎందుకు వెళ్లారని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు వేరుగా ప్రశ్నించారు. తెలంగాణవాదుల సమక్షంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో కేసిఆర్ తప్పులను తాను నిరూపిస్తానని చెప్పారు. ఆ సమావేశంలో కెసిఆర్ తప్పు చేసినట్లు తేలకపోతే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు.