చిరంజీవి ప్రకటన: గల్లా అరుణ కొడుకుకు లైన్ క్లియర్?
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళ్లనుండటంతో ఖాళీ అవుతున్న తిరుపతి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ బరిలో నిలిచే అవకాశముందని అంటున్నారు. సోమవారం చిరంజీవి చేసిన ప్రకటనతో గల్లా జయదేవ్‌కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లేనని పలువురు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తిరుపతిలో తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని చెప్పారు. భవిష్యత్తులోనైనా తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే అనుమానాలు ఉండవచ్చునని, కానీ ఖచ్చితంగా చేయరని నేను చెబుతున్నానని చిరంజీవి కుండబద్దలు కొట్టారు. నిన్నటి వరకు చిరంజీవి రాజ్యసభకు వెళ్లిన పక్షంలో తిరుపతి నుండి చిరంజీవి సోదరుడు నాగబాబు లేదా భార్య సురేఖ పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. అదే సమయంలో గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ కూడా తిరుపతి స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.
తిరుపతి స్థానంపై ఎవరిని నిలబెట్టాలనే విషయాన్ని అధిష్టానం చిరంజీవికి వదిలేస్తే ఆయన తన తమ్ముడు నాగబాబు పేరునే ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపించాయి. గల్లా అరుణ కుమారి కూడా తన తనయుడి రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే అధిష్టానం చెవిలో వేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి స్థానంలో అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనే అంశంపై చర్చ కొనసాగింది. అయితే చిరంజీవి ప్రకటనతో గల్లా జయదేవ్‌నే పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయదేవ్ మొదట శ్రీకాకుళం నుండి రంగంలోకి దిగాలని యోచించారట. అయితే అనుకోకుండా చిరంజీవి స్థానం ఖాళీ అవుతుండటంతో ఆయన తన దృష్టిని శ్రీకాకుళం నుండి తిరుపతి వైపు మరల్చారని చెబుతున్నారు. అయితే తిరుపతి స్థానాన్ని ఆశిస్తున్న వారిలో జయదేవ్‌తోపాటు ఇంకా కాంగ్రెసులో ఎందరు ఉన్నారో చిరంజీవి రాజీనామా చేసి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయితే మాత్రం తెలియదు.