న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఇన్నాళ్ల పాటు కొనసాగిన ఉత్కంఠకు పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి తెరదించింది. అందరూ ఊహించినట్లుగా ఇద్దరిని ఈ పదవి వరించింది. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా దక్కించుకున్నారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరిలకు ఇస్తారని మొదటి నుండి ప్రచారం జరుగుతున్నదే. అందరూ ఊహించినట్లుగానే వారికి ఆ పదవి దక్కింది. మరో రెండు సీట్ల కోసం పలువురు పోటీ పడ్డారు. అయితే చివరకు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్ పేర్లను అధిష్టానం ప్రకటించింది. రాత్రి పది గంటలకు ఈ పేర్లపై ఆమోద ముద్ర పడింది.
ఇక తెలుగుదేశం పార్టీ నుండి సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశమైంది. రమేష్, దేవేందర్‌ల పేర్లను పలువురు నేతలు వ్యతిరేకించారు. అయితే రాత్రి పన్నెండు గంటల వరకు నేతలను బుజ్జగించిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అదే అభ్యర్థులను ఖరారు చేశారు.