తిరుపతి: తాను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంచి మిత్రులమని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సోమవారం చెప్పారు. మోహన్ బాబు తన పుట్టిన రోజు వేడుకలను చిత్తూరు జిల్లాలోని తన శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో జరుపుకుంటున్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు, తనకు మధ్యలో చిన్న చిన్న విభేదాలు తప్ప మా మధ్య ఎలాంటి శతృత్వం లేదని స్పష్టం చేశారు. మేము మంచి మిత్రులం అన్నారు. విభేదాలు సహజమేనని అన్నారు. మేము ఇద్దరు పరస్పరం రెండు కుటుంబాల్లోని శుభకార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఉద్దేశ్యంతో తాను శ్రీవిద్యానికేతన్‌కు చంద్రబాబును ఆహ్వానించలేదని చెప్పారు.
తాను ఏ స్వార్థం లేని వాణ్ణని అన్నారు. తనకు రాజ్యసభ పదవి ఉన్నప్పుడు అయినా లేనప్పుడు అయినా ఏమీ ఆశించలేదని చెప్పారు. తనకు అందరూ కావాల్సిన వారేనన్నారు. పార్టీలతో తనకు సంబంధం లేదని వ్యక్తిగతంగా అందరూ కావాల్సిన వారేని చెప్పారు. కాగా శ్రీ విద్యానికేతన్‌లో జరగనున్న మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలకు చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.