హైదరాబాద్: శాసనసభలో అవినీతిపై చర్చకు సమయం కేటాయింపు విషయంలో మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన బీఏసీ సమావేశం ఎలాంటి నిర్ణయం జరగకుండానే అర్ధంతరంగా ముగిసింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వం, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో మంత్రులకు సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో మంత్రులను తొలగించాలని, అవినీతిపై సభలో చర్చజరగాలని గత వారం రోజులుగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతిపై చర్చ జరగాల్సిందే అంటూ వరుసగా ఏడో రోజు అయిన మంగళవారం టీడీపీ నేతలు సభను అడ్డుకున్నారు. 26 వివాదాస్పద జీవోలను స్పీకర్ ముందు ఉంచాలని తెలుగుదేశం సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అవినీతిపై చర్చ జరపాలన్నారు. అవినీతిపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జీరో అవర్ తర్వాత బిఏసీ సమావేశం నిర్వహించి, అవినీతిపై చర్చకు సమయం నిర్ణయిద్దామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆల్‌పార్టీ నేతలకు తెలిపారు. అంతకుముందు మంత్రుల బర్తరఫ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియాన్ని టిడిపి సభ్యులు ముట్టడించారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత పార్టీలు స్పీకర్‌ను వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.