న్యూఢిల్లీ: తనకు రాజ్యసభ సీటు దక్కని నేపథ్యంలో కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు కాంగ్రెసు అధిష్టానంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, ఇప్పటికైనా ఆ కత్తిని తొలగించి, చికిత్స చేసి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి బతికించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్పష్టంగా పేర్కొన్నారని, అయినప్పటికీ, తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరి ప్రకటించలేదంటూ కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పటం సిగ్గుచేటని ఆయన అన్నారు. తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.తెలంగాణకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచినప్పటికీ.. తాను మాత్రం పార్టీని వీడిపోనన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలదని, కాబట్టి అధినాయకత్వాన్ని ఒప్పించి, తెలంగాణను సాధించుకుంటామని చెప్పారు. కాగా, రాజ్యసభ సభ్యుడిగా తనకు కాంగ్రెస్ రెండోసారి అవకాశం ఇవ్వకపోవటం తనను ఆశ్చర్యపరచలేదన్నారు. తనకు అవకాశం కల్పించరన్న సంగతి ముందే తెలుసునన్నారు. తెలంగాణ పోరాటంలో భాగంగా కాంగ్రెస్‌ను తాను విమర్శించానని, కాబట్టి రాజ్యసభ సీటు మళ్లీ వస్తుందని తాను అనుకోలేదని చెప్పారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు. తెలంగాణ ఎంపీలను భయపెట్టేందుకే అధిష్ఠానం తనకు సీటు ఇవ్వకుండా ప్రయత్నించిందన్న విషయాన్ని కూడా ఉద్యమం చేస్తున్నవాళ్లు పరిశీలించుకోవాలన్నారు.