హైదరాబాద్: మద్యం సిండికేట్లపై ఎసిబి దాడుల వ్యవహారం సోమవారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో వేడిని రగిల్చింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రులు నిలదీసినంత పని చేశారు. మంత్రివర్గ సమావేశంలో అవినీతి నిరోధక శాఖలో అదనపు పోస్టుల అంశం చర్చకు వచ్చినప్పుడు మంత్రి వట్టి వసంతకుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. మద్యం సిండికేట్‌లపై దాడులు నిర్వహించాలంటూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎసిబికి లేఖ రాశారన్న ప్రచారంపై నిలదీశారు. తమ శాఖ ఉన్నతాధికారులెవరూ ఇలాంటి లేఖ రాయలేదని ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి అశుతోష్ మిశ్రా సమాధానమిచ్చారు. అదే రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ మరింత తీవ్రంగా స్పందించారు. ఎక్సైజ్ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్సు విభాగం ఉందని, ఈ విభాగం సమర్థంతంగా పనిచేయడం లేదా అని ప్రశ్నించారు. అసమర్థంగా ఉన్నందునే ఎసిబి రంగంలోకి దిగిందా అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులపై ఎసిబి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దాడులు చేపడుతోందని, ఇది ఎవరి డైరెక్షన్‌లో జరుగుతోందని, ఏ ప్రయోజనాన్ని ఆశించి జరుగుతోందని, దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందే తప్ప కలిగిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయ స్థానం పరిధిలో ఉందని, దీనిపై చర్చించడం సరికాదని హితవు పలికారు.
దీనిపై వట్టి స్పందించారు. సుమారు 122 మంది ప్రజా ప్రతినిధులు, 20 మంది మంత్రులు, శాసనసభలో సగం మందికి మద్యం వ్యాపారంతో సంబంధం ఉందన్న ప్రచారం జరుగుతోందని, దీని వల్ల ప్రభుత్వానికి అప్రతిష్ట అని అన్నారు. వ్యవస్థలో లోపాలున్నాయని సీనియర్ మంత్రి జానారెడ్డి అన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంత్రి కన్నా మాట్లాడుతూ ఎసిబి దాడులు ఎవరి ప్రమేయంతోనూ జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి బొత్స కల్పించుకుని... ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా, లేకున్నా ప్రజాప్రతినిధులందరూ సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక మహిళా ఎమ్మెల్యే లంచం అడిగారంటూ ఎసిబి అధికారులు నివేదికలను లీకు చేశారని గుర్తు చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎక్సైజ్‌శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వేరని, అలాగే ఎసిబి వేరని, అయితే ప్రస్తుతం జరిగిన దాడులతో ఎక్సైజ్ శాఖ అధికారుల ఆత్మ స్థైర్యం దెబ్బతినడం నిజమని అన్నారు.