హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పొందటం బాధాకరమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు బుధవారం అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యత వహించాలని అన్నారు. ఓటమిపై వారు ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణపై ఎవరో కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేసి పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు. లేదంటే 2014 ఎన్నికల్లో పార్టీ గల్లంతు కావడం ఖాయమన్నరు. పార్టీకి ఈ గతి పట్టిందంటే ప్రజల మనోభావాలు పార్టీ నేతలు సరిగా అర్థం చేసుకోలేదనే అన్నారు. స్టేషన్ ఘనపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెసు ఎమ్మెల్యేలు అయి ఉండి రాజీనామా చేసి మరీ వేరుగా గెలిచారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ వాదమే గెలిచిందన్నారు.
కామారెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పును మేం గౌరవిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణపై అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు అయితే రెండు ప్రాంతాలలో కాంగ్రెసు పార్టీయే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి మరిచిపోయారని ఎంపి వివేక్ ఆరోపించారు. హామీలపై ఆయన మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఓటమికి బాధ్యత వహించాలన్నారు.