హైదరాబాద్: పార్టీ అధిష్టానం తనతో ఓసారి తెలంగాణ అంశంపై మాట్లాడిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం చెప్పారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువత ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. కేంద్రం త్వరలో తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆత్మహత్యలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆయన అన్నారు. నేతల ప్రకటనల వల్లే ఆత్మహత్యలు అని ఆరోపించడం సరికాదన్నారు. అన్ని పార్టీలు కోరితే ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రకటన చేస్తామన్నారు. ప్రకటన చేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవన్నారు. ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే ఆత్మహత్యలన్నింటిని ఒకే ఘాటాన కట్టవద్దన్నారు. ఆత్మహత్యలకు పలు కారణాలు ఉంటాయని చెప్పారు.
తనపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వారి వ్యక్తిగతమన్నారు. కాంగ్రెసు పార్టీలో అసమ్మతి మామూలే అన్నారు. అసంతృప్తి కాంగ్రెసులో ఓ భాగం అన్నారు. కాంగ్రెసు పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని, అసమ్మతి ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నారు. అతిగా వ్యవహరించిన వారిపై గతంలో చర్యలు తీసుకున్నామన్నారు. గీత దాటిన వారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు ఇంకా రాలేదన్నారు. ఏఏ విభాగాల్లో ఛార్జీలు తగ్గించాలనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దేవదాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలపై ఆయన సమాధానాన్ని దాట వేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు.