హైదరాబాద్: కడప జిల్లాలో మరోసారి ఫాక్షన్ కక్షలు పడగ విప్పాయి. కడప జిల్లాలోని తొండూరు మండలం బూచుపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు రమణా రెడ్డి ప్రత్యర్థుల చేతిలో మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతన్ని వేటకొడవళ్లతో నరికి చంపారు. పొలం వద్ద ట్రాక్టర్‌లో మట్టి పనిచేస్తుంటే ప్రత్యర్థులు దాడి చేసి రమణా రెడ్డిని హత్య చేశారు. హత్య జరిగిన బూచుపల్లి గ్రామం వైయస్ విజయమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల శాసనసభా నియోజకవర్గంలోనే ఉంది.
పాతకక్షలే రమణా రెడ్డి హత్యకు కారణమని భావిస్తున్నారు. నెల రోజుల క్రితం ఓ హత్య జరిగింది. ఈ హత్య కేసులో రమణా రెడ్డి నిందితుడని తెలుస్తోంది. ఆ హత్యకు ప్రతీకారంగానే ప్రత్యర్థులు రమణా రెడ్డిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.