హైదరాబాద్: మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి బుధవారం తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని ఆయన అధిష్టానాన్ని కోరారు. ఏదో ఒకటి తేల్చాలని తాము కూడా కోరుతున్నామన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో ఎప్పుడూ చెప్పలేదన్నారు. 2004లో రెండో ఎస్సార్సీకి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఒప్పుకుందని చెప్పారు. తెలంగాణ విషయంలో అధిష్టానంపై ఎలాంటి ఒత్తిడి లేదని, పార్టీకి ఇబ్బందులు లేవన్నారు. ఈ విషయంలో తాము పార్టీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పామన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది వారే అని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చాలన్నారు. మేం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రోడ్లపైకి వచ్చి, పట్టాల పైకి ఎక్కితేనే ఉద్యమం ఉన్నట్టా అని ఆయన ప్రశ్నించారు. రైలు పట్టాలెక్కి ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమమా అన్నారు.
తెలంగాణ నేతలను మా ప్రాంతంలో గౌరవిస్తున్నామంటే మేం తెలంగాణకు అనుకూలమని అర్థం కాదన్నారు. ఏ వ్యక్తినైనా గౌరవించడం మా ప్రాంత సంప్రదాయం అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదన్నారు. యుపిఏలోని భాగస్వామ్య పక్షాలన్ని విభజనను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కాగా మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి కూడా తెలంగాణ అంశంపై మాట్లాడారు. ఆయన మరోసారి రాయల తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఓకె చెప్పారన్నారు. టిఆర్ఎస్, ఎంఐఎం నేతలు కూడా టచ్‌లో ఉన్నారన్నారు. అయితే రాయల తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకే ఇష్టం లేదన్నారు.