తెలంగాణపై కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది: నామా
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ఆరోపించారు. తెలంగాణపై ఏదో ఒక విషయం చెప్పాలని డిమాండ్ చేస్తూ తాము లోకసభ సమావేశాలను అడ్డుకుంటున్నా, వైఖరి చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనం వహిస్తున్నారని, దీన్ని బట్టి కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని అనుకోవాల్సి వస్తోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మూడు రోజులుగా లోకసభ సమావేశాలను స్తంభింపజేస్తున్నా ప్రభుత్వం తెలంగాణపై మాట్లాడకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు.
తెలంగాణకు కాంగ్రెసు పార్టీ తీరని అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మహత్యలపై కూడా కాంగ్రెసు పార్టీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై లోకసభలో చర్చ జరగాలని, ప్రభుత్వ వైఖరి చెప్పాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ కన్నా తమకు తెలంగాణ ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణపై తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ సభ్యులతో ప్రభుత్వం నాటకాలు ఆడిస్తోందని తెలుగుదేశం మరో పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ అన్నారు.