చంద్రబాబుతో సమరం: అమీతుమీకే హరికృష్ణ రెడీ?

చంద్రబాబును పార్టీ అధ్యక్ష పదవి నుంచి దించాలనే ఆలోచన కూడా హరికృష్ణకు ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. చంద్రబాబు చేతి నుంచి పార్టీ పగ్గాలను తీసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిని మార్చే డిమాండ్ ప్రజల నుంచి రావాలని అనడం ఆ విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లే సాకుతో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలనే సూచన కూడా ఆయన చేసినట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి హరికృష్ణ పూర్తిగా వెనకేసుకొచ్చారు. పార్టీ కోసం తన బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణత్యాగానికి కూడా సిద్దపడ్డాడని ఆయన అన్నారు. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు మరో మారు తీవ్ర స్థాయికి చేరుకుంది. జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా ఆడియో విడుదల రోజును, పార్టీ ఆవిర్భావ దినాన్ని చంద్రబాబుపై దాడికి హరికృష్ణ ఎంచుకోవడం విశేషం.