హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇవ్వడానికి రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్యసభ పదవీ కాలం పూర్తి కాగానే ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తలను మైసురా రెడ్డి ఖండిస్తున్నారు. రెండు విడతలు ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. మూడో సారి తిరిగి నామినేట్ చేయకుండా ఆయన కడప జిల్లాకు చెందిన సిఎం రమేష్‌కు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆయన ఇక తెలుగుదేశం పార్టీలో కొనసాగకపోవచ్చునని అంటున్నారు.
గతంలో కూడా చాలా మంది రాజ్యసభ పదవీ కాలం ముగియగానే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లో చేరిపోయారు. అలాంటి ఓ సంప్రదాయం తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు వస్తుందని అంటున్నారు. అలాంటి నాయకులు డజనుకు పైగానే ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సి. రామచంద్రయ్య కూడా అదే పని చేశారు. జయప్రద, రేణుకా చౌదరి కూడా ఈ కోవలోకే వస్తారు. రామ మునిరెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య వంటివారు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.