హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో హైదరాబాద్ అంశం కొత్తదేమీ కాదని మంత్రి దానం నాగేందర్ అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం పట్ల తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై అధిష్టానం సీరియస్‌గా ఆలోచన చేస్తుందని చెప్పడానికి కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలే సంకేతాలని ఆయన అన్నారు. త్వరలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
సామాన్యులపై, పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని తాను అధిష్టానానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. దానం నాగేందర్ ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆజాద్‌ను కలిసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటు విషయంలో దానం నాగేందర్ హైదరాబాద్ అంశాన్ని లేవనెత్తినప్పుడు కొత్త సమస్యలు సృష్టించవద్దని సోనియా సూచించినట్లు వార్తలు కూడా వచ్చాయి.