• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్, టిఆర్ఎస్‌తో కలిసి టిడిపికి చెక్:కాంగ్రెస్ వ్యూహం?

By Srinivas
|

sonia gandhi-kcr-ys jagan
హైదరాబాద్: తెలంగాణ, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని యోచిస్తున్నదని అంటున్నారు. 2014లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ, సీమాంధ్రలో వైయస్ సెంటిమెంట్ అధిగమించేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. 2014లో యుపిఏ తిరిగి అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ వంటి ప్రధానమైన రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే కష్టమని కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో రాష్ట్రంపై ప్రత్యేకంగా అధిష్టానం దృష్టి సారించిందని తెలుస్తోంది. తెలంగాణ, వైయస్ఆర్ సెంటిమెంట్‌కు తోడు పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య విభేదాలు పార్టీ పెద్దలను మరింత కలవరపరుస్తున్నాయట. దీంతో వారు ఇక నుండి రాష్ట్రంలోని ముఖ్య నిర్ణయాలపై సిఎం, పిసిసి చీఫ్‌లకు అప్పగించకుండా నేరుగా తామే తీసుకోవాలని చూస్తున్నారట.

అందులో భాగంగానే త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేసేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఒక ఎంపీ, ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు పిసిసి ప్రతినిధులతో కలిపి ఓ కమిటీని ఏర్పర్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వారు ఓ నివేదిక తయారు చేసి పిసిసి చీఫ్‌కు ఇస్తే ఆయన అధిష్టానానికి అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా పార్టీ పెద్దలే అభ్యర్థులను ఖరారు చేస్తారు. ఇక 2014 ఎన్నికలే లక్ష్యంగా టిఆర్ఎస్, జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న దృష్ట్యా తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావిస్తోందంట.

ఒకవేళ తెలంగాణ ఇవ్వాలనుకుంటే టిఆర్ఎస్‌ను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలాగే కాంగ్రెసులో విలీనం చేసిన పక్షంలో తెలంగాణ ఇస్తామని ప్రకటించాలనే యోచనలో ఉందంట. టిఆర్ఎస్ విలీనం కాకుండా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ క్రెడిట్ కెసిఆర్‌కు, ఆ పార్టీకే వెళ్తుందని తద్వారా కాంగ్రెస్ నష్టం వాటిల్లుతోందని అధిష్టానం భావిస్తోందంట. అందుకే కెసిఆర్ టిఆర్ఎస్ విలీనానికి ఓకె చెప్తే తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఉందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా వైయస్ జగన్మోహన్ రెడ్డిని 2014లోపు కాంగ్రెసులో తిరిగి చేర్చుకోవాలని లేదా ఆయన స్థాపించిన పార్టీతో కలిసి వెళ్లాలనే యోచనలో ఉందంట.

ఇప్పటికే కడప, పులివెందుల, కొవూరులలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం ఎదుర్కొంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీ అధిష్టానం జగన్ అంశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందంటున్నారు. 2014 నాటికి కెసిఆర్, జగన్‌ను కలుపుకుంటే కాంగ్రెసు పార్టీ మళ్లీ బలపడుతుందని, తద్వారా తెలుగుదేశం పార్టీని కూడా చిత్తు చేయవచ్చునని అభిప్రాయపడుతోందంట. ఇప్పటికే పలువురు కాంగ్రెసు నేతలు గతంలో, జగన్ ఎప్పటికైనా కాంగ్రెసులోకే వస్తారనే వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్‌ను కలుపుకొని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని అధిష్టానం భావిస్తోందంట. ఆ దిశలో వేగంగా వ్యూహరచన చేస్తోందని అంటున్నారు.

English summary
It seems, Congress party high command changed strategy 
 
 to win in 2014 election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X