• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాబు, వైయస్ జగన్, కెసిఆర్: నేతలకు ఇంటిపోరు?

By Srinivas
|

Chandrababu Naidu-K Chandrasekhar Rao-YS Jagan
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటి పోరు ఎదుర్కొంటున్నారు. వీరిలో ప్రధానంగా చంద్రబాబు తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నుండి బాగానే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. గతంలో పలుమార్లు చంద్రబాబుతో విభేదించినప్పటికీ ఇటీవల ఆయన బాబుతో రాజీకి వచ్చినట్లు కనిపించింది. అయితే అంతలోనే ఆయన మళ్లీ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలు టిడిపితో పాటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశమయ్యాయి.

టిడిపి నందమూరి కుటుంబానిదేనని, నాయకుల వల్లనే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉందని సూచించారు. బాబుని నాయకుడిని చేసింది తామేనని చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. కుటుంబం, వేరు పార్టీ వేరు అన్నారు. పార్టీలో కుటుంబ సభ్యులు ఉన్నా ఎవరు ఉన్నా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పార్టీలోని నేతలు కూడా హరికృష్ణ వ్యాఖ్యలకు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఆయన ఇప్పటి నుండి తన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు తర్వాత టిడిపి పగ్గాలు నారా లోకేష్‌ చేతికి వెళ్లకుండా ఆయన జాగ్రత్తలు పడుతున్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమౌతోందని చెబుతున్నారు. అదే సమయంలో హరికృష్ణ జూ.ఎన్టీఆర్‌కు ఇంకా అనుభవం కావాలని చెబుతున్నారు.

ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డీ ఇంటి పోరు ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ పరిస్థితి వేరు. తన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులో ఉంటూ కడప జిల్లాలో జగన్‌కు రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే మారారు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ వివేకానంద తన వదిన వైయస్ విజయలక్ష్మి పైనే పోటీ చేశారు. వైయస్ జగన్‌పై పోటీకి తన అల్లుడిని దింపేందుకు కూడా బాగానే ప్రయత్నాలు చేశారు. ఉప ఎన్నికల్లో ఆయన ఓడినప్పటికీ జిల్లాలో ఆయన పట్ల చాలా సానుకూలత ఉంది. అయితే జగన్‌పై ఉన్న సానుభూతి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానం ముందు అది నిలవడం లేదు. దీంతో జిల్లాలో ఆయన జగన్‌ను ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు. అయితే తాను మాత్రం కాంగ్రెసును వదిలేది లేదని వైయస్ వివేకా స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు కెసిఆర్‌పై ఆయన మేనల్లుడు ఉమేష్ రావు ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ అంటే కెసిఆర్ కెసిఆర్ అంటే తెలంగాణ అనే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమేష్ విమర్శలు టిఆర్ఎస్‌కు నష్టం కలిగించక పోయినప్పటికీ పార్టీ నడుపుతున్న వ్యక్తికి ఇంటి పోరు ఉండటం పట్ల టిఆర్ఎస్ వర్గాలు కొంత ఆందోళన చెందాయట. బయటి వాళ్లు విమర్శలు చేస్తే రివర్స్ ఎటాక్ చేయవచ్చుకానీ ఇంటి వ్యక్తి తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తే ఎలా అని, ఆయనను కట్టు చేసేందుకు ఏం చేయాలా అని కెసిఆర్ కూడా ఆలోచించారనే వాదనలు వినిపించాయి.

English summary
TDP chief Nara Chandrababu Naidu, YSR Congress Party president YS Jaganmohan Reddy and TRS chief K Chandrasekhar Rao facing problem with their relatives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X