మంత్రి ఆమోదంతోనే: సబిత చెప్పింది తప్పన్న శ్రీలక్ష్మి

Sabitha Indra Reddy - Srilaxmi
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని, ఇందుకు సంబంధించిన జీవోలన్నీ అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆమోదంతోనే జారీ అయ్యాయని ఓఎంసి కేసులో నిందితురాలు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. తనకు సంబంధం లేదని సబితా చెప్పిన దాంట్లో నిజం లేదని తెలిపారు. ఓఎంసీకి ముడి ఇనుప గనుల లీజుల కోసం జారీ అయిన జీవోలు, గనుల శాఖ జారీ చేసిన జీవోలు అప్పటి ఆ శాఖ మంత్రి ఆమోదంతోనే వెలువడ్డాయని చెప్పారు.

వీటి ప్రతిపాదనలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చాయని, అలా వచ్చిన ప్రతిపాదనలను మంత్రి పేషీకి నాడు తాను పంపించానని, మంత్రి ఆమోదంతోనే ఆ జీవోలన్నీ విడుదలయ్యాయని, కాబట్టి, ఓఎంసి అక్రమాలతో నాకు ఏ సంబంధం లేదని శ్రీలక్ష్మి చెప్పారు. అండర్ ట్రయల్ ఖైదీగా 90 రోజులకు పైగా తాను జైల్లోనే ఉన్నందున, తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, ఈ పరిస్థితిలో తనకు బెయిల్ మంజూరు చేయాలని సిబిఐ కోర్టును ఆమె కోరారు.

ఈ మేరకు శ్రీలక్ష్మి తరఫున బెయిల్ పిటిషన్‌ను ఆమె న్యాయవాది.. నాంపల్లి సిబిఐ కోర్టులో గురువారం దాఖలు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎపిఎండిసి)కు కేటాయించిన 25 హెక్టార్ల గనులను కూడా ఓఎంసికి కేటాయించాలంటూ తాను ఒత్తిడి చేసినట్లు మంత్రి తనపై చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఎవరిపై తాను ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని చెప్పారు.

సీనియర్ ఐఏఎస్ అధికారిగా సేవలందించిన తనపై ఎలాంటి ఆరోపణలు లేవని, నిజాయతీగా పనిచేశానని ఆమె తెలిపారు. సిబిఐ తనను బలిపశువును చేసిందని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. కొందరి ప్రయోజనాలను కాపాడేందుకే అధికారులు నాపై అభియోగాలు మోపారని, జీవోలో తాను క్యాప్టివ్ అనే పదం తొలగించానని కట్టుకథలు అల్లారని, వారి వాదన నిజం కాదని చెప్పారు.

దేశంలో ఎక్కడా క్యాప్టివ్ అనే పదంతో జీవోలు జారీ కాలేదన్నారు. ఈ విషయం అధికారులకు తెలియనిది కాదని చెప్పారు. ఇదంతా తెలిసినప్పటికీ, దురుద్దేశంతో నాపై నిందలు చేస్తున్నారు. నాకు బెయిల్ రాకుండా ఉండాలనే సిబిఐ ఇదంతా చేస్తోంది. ఓఎంసి వ్యవహారాలతో తనకు సంబంధం లేదని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులో నిల్వ ఉంచిన ఎక్కడో తవ్వి తెచ్చారని చెబుతున్న ఇనుప ఖనిజం గురించి తనకు తెలియదన్నారు.

నాకు కౌమార దశలో ఉన్న పిల్లలు ఉన్నారని, తాను జైల్లో ఉండటం వారిని, ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధిస్తోందని కోర్టుకు శ్రీలక్ష్మి నివేదించారు. హైకోర్టు ఆదేశాల ప్రభావంతో కాకుండా.. ఓఎంసి కేసును చట్టపరంగానే విచారణ చేయాలంటూ సిబిఐ కోర్టును సుప్రీం కోర్టు నిర్దేశించిందని అన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టుపై విశ్వాసంతో బెయిల్ కోసం తాను దరఖాస్తు చేసుకుంటున్నానని పేర్కొన్నారు.

తనకు ఏ విధంగానూ సంబంధంలేని విషయాలను కూడా ఓఎంసి కేసు విచారణ సందర్భంగా సిబిఐ ప్రస్తావిస్తోందని శ్రీలక్ష్మి ఆరోపించారు. తన హయాంలో జారీ అయిన జీవో 151 పైనే దర్యాప్తు చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇతర మైనింగ్ లీజులు, వాటికి సంబంధించిన వ్యవహారాలను సిబిఐ ప్రస్తావిస్తోందని, ఇలా చేయడం హైకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు.

నాపై మొదట ఆయా సెక్షన్లతో పాటు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, మార్చి 31న వేసిన అడిషనల్ చార్జ్‌షీట్‌లో 420 సెక్షన్‌ను తొలగించి, 409 సెక్షన్‌ను జోడించారని, ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై కోర్టుకు కూడా సిబిఐ సమాచారం ఇవ్వలేదని తెలిపారు.

దర్యాప్తు పూర్తయినందున సిబిఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిందని, తనకు మాత్రం బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని, చాలా రోజులుగా జైల్లో ఉన్నందన బిపి, గుండె నొప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిలో నాకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో, శ్రీలక్ష్మి వేసిన పిటిషన్‌పై కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేయాలంటూ సిబిఐని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ వెంటనే, కేసును 17కు వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+