కేంద్రంపై గుర్రుమన్న తమిళనాడు సిఎం జయలలిత

కేంద్రం రాష్ట్రాల స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఎన్‌సిటిసి వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుదని ఆమె అభిప్రాయపడ్డారు. పోలీసుల సంస్కరణలు చేపట్టడానికి కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం మున్సిపల్ కార్పోరేషన్ల స్థాయికి దిగజార్చిందని మండిపడ్డారు. నిధుల కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడవలసి వస్తోందన్నారు. కాగా సాయంత్రం జయలలిత కాంగ్రెసేతర ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు.
కాగా అంతకుముందు ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం దేశానికి సవాళ్లు విసురుతోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. సోమవారం జాతీయ అంతర్గత భద్రతా సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఈ సదస్సు వల్ల అందరి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాదం దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. దేశ భద్రత విషయంలో సమైక్య సహకారం ఉంటేనే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్గత భద్రత సదస్సు ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పారు. ఎన్‌సిటిసిపై మే 5న ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశమవుతామని మన్మోహన్ చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు చేయి చేయి కలిపితే అంతర్గత భద్రత సాధ్యమని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. జమ్ముకాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడిందన్నారు. తీర ప్రాంత భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
జమ్మూ-కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో హింస తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోంమంత్రి చిదంబరం చెప్పారు. హింస తగ్గడం వల్లనే భారత దేశానికి విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు. మావోయిస్టులను అదుపు చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సాయం చేస్తుందని చెప్పారు. అంతర్గత భద్రతపై ఆయా రాష్ట్రాలు పూర్తిగా పకడ్బందీగా ఉండాలని సూచించారు. దేశంలో గత ఏడాది పద్దెనిమిది ఉగ్రవాద కేంద్రాలను నిర్మూలించామని చెప్పారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం వేళ్లూనుకుందని చెప్పారు.












Click it and Unblock the Notifications