దీదీగిరి: ఎవరీ మమతా బెనర్జీ, ఎలా ఎదిగారు?

రాష్ట్రంలో 34 ఏళ్ల పాటు పాతుకుపోయిన సిపిఎంను పెకలించి వేయడంతో ఆమె సత్తా ఏమిటో భారతదేశానికి తెలిసి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పుడు తన మార్కు పరిపాలనను సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకులు కొందరు అసూయతో ఆమె రాజకీయ చర్య గురించి మాట్లాడుతుంటారు. పూర్తిగా కింది స్థాయి నుంచి ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది. రాత్రి ఆమె సిపిఎం వ్యతిరేక పోస్టర్లను అతికించేవారని, వాటిని పగలు సిపిఎం కార్యకర్తలు తొలగించేవారని, ఆ తర్వాత మళ్లీ రాత్రి ఆమె పోస్టర్లు వేసేవారని అంటారు. ఇది ఆమె కాంగ్రెసులో కార్యకర్తగా ఉన్నప్పటి మాటలు.
ఆమె సిపిఎం వ్యతిరేకత స్థాయి ఏ స్థాయిలో ఉందని సిపిఎంవారిని ఓ మంత్రి సూచించడాన్ని బట్టి తెలుస్తోంది. కోల్‌కత్తాలో 1955 జనవరి 5వ తేదీన జన్మించిన మమతా బెనర్జీ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పెరిగారు. పాఠశాల స్థాయి నుంచే ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతూ వచ్చారు. ఆమె 1970లో కాంగ్రెసు పార్టీలో చేరారు. జోగమాయ దేవి కళాశాల నుంచి చరిత్రలో డిగ్రీ పూర్తి చేశారు. కోల్‌కత్తా విశ్వవిద్యాలయం నుంచి ఇస్లామిక్ చరిత్రలో మాస్టర్స్ చేశారు. జోగేష్ చంద్ర చౌదరి లా కళాశాలలో న్యాయశాస్త్రం కూడా చదివారు. మమతాకు కవిత్వం రాయడమంటే మహా ఇష్టం. పోరిబోర్టాన్ (మార్పు) పేర ఓ కవిత్వ సంకలనం తెచ్చారు. కొబిత (కవితలు) పేర మరో పుస్తకం కూడా వచ్చింది. ఇటీవలే ఆమె రాసిన మై అన్‌ఫర్గెటెబుల్ మెమొరీస్ (మర్చిపోలేని నా జ్ఞాపకాలు) పుస్తకం కూడా వచ్చింది.
వ్యక్తిగతంగా మమతా బెనర్జీ నిరాడంబరమైన నాయకురాలు. మామూలు కాటన్ చీరెలు ధరిస్తారు. రబ్బర్ స్లిప్పర్లు తొడుగుతారు. అయితే, ఎదుటివారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తారనేది తెలిసిపోతూనే ఉన్నది. యుపిఎలో భాగస్వామి అయిన ఆమె కాంగ్రెసును ఎప్పటికప్పుడు చిక్కుల్లో పడేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ ఏదో సమస్యను ముందు పెడుతూనే ఉన్నారు. పోస్టర్లు అతికించే మామూలు కార్యకర్త నుంచి ఆమె కాంగ్రెసు ఎదుగుతూ వచ్చారు. మొదటిసారి ఆమె 1984 ఎన్నికల్లో పోటీ చేశారు.
మమతా బెనర్జీ 1997లో కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెసును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆమె ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి మొక్కవోని ధైర్యంతో పాటు పడుతూనే ఉన్నారు. దాదాపు అందుకు ఆమెకు 14 ఏళ్లు పట్టింది. కేంద్రంలో ఆమె గతంలో బిజెపితోనూ పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి కావాలనే కోరికను ఆమె వదిలేయలేదు. పశ్చిమ బెంగాల్‌లో పాతుకుపోయిన వామపక్ష ప్రభుత్వాన్ని పెకలించి వేసి, అధికారాన్ని సొంతం చేసుకున్నారు. దీదీగా ఆమెను పిలుస్తారు. ఈ దీదీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా దీదీగిరి అనే పదాన్ని వాడకంలోకి తెస్తున్నారు. అయితే, మమతా బెనర్జీ అసహనం వల్ల అలా వ్యవహరిస్తున్నారా, అభద్రతా భావం ఆమె చుట్టుముడుతోందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.












Click it and Unblock the Notifications