మేకపాటిపై సుబ్బిరామిరెడ్డే: సోనియా గాంధీ ఆదేశం

తనకు సుదీర్ఘ రాజకీయానుభవం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే మేకపాటి రాజమోహన్ రెడ్డి తనకు మిత్రుడేనని ఆయన అన్నారు. రాజమోహన్ రెడ్డి నెల్లూరు లోకసభ స్థానానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. దాంతో నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మేకపాటిపై కాంగ్రెసు పార్టీ టి. సుబ్బిరామిరెడ్డిని పోటీకి దింపడం ఖాయమైంది.
సుబ్బిరామి రెడ్డి తన పోటీని దృష్టిలో పెట్టుకునే ఇటీవల నెల్లూరుకు వెళ్లారు. ఆయన నెల్లూరుకు చెందినవారే. ఆయితే, చాలా కాలంగా విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం లోకసభ స్థానానికి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఆయన కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ అధిష్టానం మరో విధంగా ఆలోచించింది. నెల్లూరు నుంచి మేకపాటిపై సుబ్బిరామిరెడ్డిని బరిలోకి దింపుతోంది.
నిజానికి, మాజీ ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్దన్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆయన ఆరోగ్యం సహకరించేట్లు లేదు. దీంతో అధిష్టానం టి. సుబ్బిరామిరెడ్డి అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కాంగ్రెసులో రెండు గ్రూపులు ఉండడంతో ఇరు గ్రూపుల మద్దతు పొందడానికే టి. సుబ్బిరామిరెడ్డిని రంగంలోకి దింపినట్లు అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications