జగన్‌ను ఎదుర్కోండి, వ్యక్తులు కాదు పార్టీ: వాయలార్

కాంగ్రెసు పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదని, విధానాలు ముఖ్యమని ఆయన చెప్పారు. పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఉప ఎన్నికలపై అధిష్టానం చాలా సీరియస్‌గా ఉందన్నారు. సమీక్షా సమావేశాలు సజావుగా సాగాయని ఆయన అన్నారు. పార్టీ నేతలకు కొత్తగా తాను ఏ దిశా నిర్దేశనం చేయలేదన్నారు. సోనియా గాంధీకి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు. మళ్లీ హైదరాబాద్ వస్తానని చెప్పారు.
కాంగ్రెసుకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఆయన అభివర్ణించారు. తాను రాష్ట్రానికి వచ్చి ఐదు రోజులు అవుతోందని, ఈ ప్రభావం ఉప ఫలితాలలో కనిపించాలని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను అందరూ ధీటుగా ఎదుర్కోవాలన్నారు. ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాలపై వాయలార్ రవి ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్, నియోజకవర్గం నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో పదిమందితో కూడిన బూత్ కమిటీలను వారం రోజుల్లోగా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయా నియోజకవర్గ నేతలకు సూచించారు. వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలని కిరణ్ సూచించారు.
కాగా వాయలార్ రవి తన రాష్ట్ర పర్యటనను ముగించుకొని న్యూఢిల్లీ తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ నాయకుల నుండి సేకరించిన అభిప్రాయాన్ని ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇవ్వనున్నారు. ఆ తర్వాత మళ్లీ వారం రోజుల తర్వాత ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో ఆయన పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications