జగన్ సిఎం కాకుండా కుట్ర, చిరు వస్తే కొడతారు: గట్టు

రాష్ట్రంలో ఉప ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ వైస్ జగన్ పైన, ఆయన కుటుంబం పైన, పార్టీ నేతలు, కార్యకర్తల పైన వేధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలలో కాంగ్రెసు, టిడిపిలకు ఒక్క స్థానం కూడా దక్కదని సర్వేలు స్పష్టం చేయడంతో ఆ పార్టీల నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. వైయస్ మరణం వెనుక పెద్దల హస్తముందని ఆరోపించారు.
జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఎలాగైన ఎన్నికలను వాయిదా వేయించాలనే ఉద్దేశ్యంతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. మాచర్లలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుపాళ్లు వాస్తవమన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి చేస్తున్న కుట్రలు స్పష్టంగా బయటపడుతున్నాయన్నారు. అందుకే జగన్ వాటిని ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేశారన్నారు. కాంగ్రెసు, టిడిపితో కలిసి ఓ వర్గం మీడియా జగన్‌ను టార్గెట్ చేసుకుందన్నారు.
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ప్రజలను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు కౌరవ సైన్యంలా వందమంది దాడి చేస్తున్నారని గట్టు అన్నారు. చంద్రబాబు, కిరణ్, ఆజాద్, వాయలార్ రవి ఇలా ఇన్ని బుర్రలు కలిసి ఒక్కరిని వేధిస్తున్నాయన్నారు. కాంగ్రెసు బలపడుతుందన్న రవి వ్యాఖ్యలు ఈ దశాబ్దపు జోక్ అన్నారు. కాంగ్రెసు బలపడేది లేదు, దానికి భయపడేది లేదన్నారు.
పార్టీని దివంగత వైయస్ లీడ్ చేసినప్పుడు కాంగ్రెసు ఓ కడిగిన ముత్యంలా ఉండేదని, ఎప్పుడైతే జగన్ బయటకు వచ్చారో అప్పటి నుంచి ముత్యం లేని చిప్పలా మారిపోయిందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చిరంజీవి అంత దౌర్భాగ్యుడు ఎవరూ లేరన్నారు. తన స్వార్థం కోసం పార్టీని హోల్ సేల్‌గా అమ్ముకున్నారన్నారు. ఢిల్లీ నుండి డబ్బులు తెచ్చి రాష్ట్రం కాని రాష్ట్రంలో దాచారాన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ విలువలు, నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
2009లో పిఆర్పీకి ఓట్లేసిన వారి దగ్గరకు చిరంజీవి వెళ్తే బట్టలూడదీసి కొడతారన్నారు. లబ్ధి పొందడం వల్లే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతున్నారన్నారు. మరి ఆయన తమ్ముడు శ్రీధర్ ఏం లబ్ధి పొందారో చెప్పగలరా అన్నారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును మించిన వారు లేరన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు శంకుస్థాపన చేసింది, హత్యా రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబే అన్నారు.












Click it and Unblock the Notifications