ఏపి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకెళ్తాం: సల్మాన్ ఖుర్షీద్

Posted By:
Subscribe to Oneindia Telugu
Salman Khurshid
న్యూఢిల్లీ: మైనార్టీల రిజర్వేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ మంగళవారం అన్నారు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మైనార్టీల జనాభా ఆధారంగానే 4.5 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిజర్వేషన్ కేటాయింపును కొట్టివేయడంపై తాము సుప్రీంను ఆశ్రయిస్తామని చెప్పారు.

సబ్ కోటా మతపరమైనది కాదన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు విధిగా అవసరం అన్నారు. మండల కమిషన్ సిఫార్సుల మేరకు మైనార్టీలు వెనుకబడిన వర్గాలే అన్నారు. విద్యా, ఉద్యోగ రంగాలలో 4.5 శాతం కోటాను కేంద్రం మైనార్టీలకు కల్పించింది. దీనిపై బిసి సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి. దీనిపై హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో వెనకబడిన కులాల కోటా కింద మైనారిటీలకు కేటాయించిన 4.5% రిజర్వేషన్ చెల్లదని రాష్ట్ర హైకోర్టు డివిజన్‌బెంచ్ సోమవారం తీర్పునిచ్చింది. ఈ విషయంలో కేంద్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ఐఐటీల్లాంటి విద్యాసంస్థలలో ఇప్పటికే ఈ ప్రాతిపదికన జరిగిన అడ్మిషన్లపై ఈ తీర్పు ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీసీలకు కేటాయించిన 27% రిజర్వేషన్ లోంచే సామాజికంగా వెనకబడిన మైనారిటీలకు 4.5%ను కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది.

కేంద్ర విద్యాసంస్థలలో ప్రవేశాలు, ఉద్యోగాలలో ఇప్పటికే ఓబీసీలకు ఉన్న 27% రిజర్వేషన్ల లోంచి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన మైనారిటీలకు 4.5% సబ్‌కోటా కల్పిస్తూ 2011 డిసెంబర్ 22న కేంద్ర ప్రభు త్వం ఒక ఆఫీస్ మెమొరాండం (ఓఎం)ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ స హా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా ఈ ప్రకటన చేసింది. దీనిపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పెరిక విద్యార్థి వసతి గృహ ట్రస్టు మా జీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ యలమంద, వీవర్స్ వెల్ఫేర్ ట్రస్టు ప్రతినిధి కె.స్వామి దా ఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.

అసలు ఈ రిజర్వేషన్ల అమలుకు సిఫార్సు చేసిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటే చట్టబద్ధం కాదని బెంచ్ అభిప్రాయపడింది. కమిషన్ సూచనతో గత ఏడాది డిసెంబర్ 22న కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో, ఉద్యోగ రంగంలో సామాజికంగా వెనుకబడిన మైనారిటీలకు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని విడుదల చేసిన ఆదేశాలు (మోమోలు) చెల్లవని స్పష్టం చేసిం ది. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లను అందరినీ కలిపి 'ఒకే జాతి'గా పేర్కొనడం సరికాదని.. వీరంతా 'వేర్వేరు జాతులు' అని బెంచ్ వ్యాఖ్యానించింది.

'నేషనల్ కమిషన్ ఫర్ లింగ్విస్టిక్ రెలిజియస్ మైనారిటీ' (ఎన్‌సీఆర్ఎల్ఎం) జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992లోని క్లాజ్ సీ ఆఫ్ సెక్షన్2 ప్రకా రం మైనారిటీలకు ఈ రిజర్వేషన్ కేటాయించడం చెల్లదని కోర్టు పేర్కొంది. మైనారిటీల్లో వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని చెప్పడానికి.. ప్రభుత్వం వద్ద దాన్ని నిర్ధారించే సమాచారం కూడా లేదంది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్‌సీఆర్ఎల్ఎం సిఫార్సులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్స్ యాక్ట్ (ఎన్‌సీబీసీ) 1993 ప్రకారం ఏర్పడిన కమిషన్ మాత్రమే దేశంలోని ఓబీసీ కులాలను గుర్తిస్తుందని, జాబితాలో మార్పులు, చేర్పులు చేసే అధికారం ఆ సంస్థకే ఉంటుందని స్పష్టం చేసింది.

కమిషన్ నోట్ ప్రకారం మైనారిటీల్లో ఓబీసీలు, నాన్ ఓబీసీలుగా గుర్తించడం ఆర్టికల్ 15(1), 16 (2), రెడ్‌విత్ ఆర్టికల్ 14 ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. మైనారిటీ ఓబీసీ, నాన్ మైనారిటీ ఓబీసీలను గుర్తించే ప్రక్రియ జాతీయ బీసీ కమిషన్ మాత్రమే చేపడుతుందన్నారు. రాష్ట్రంలో గానీ, కేంద్రంలోగానీ వెనుకబాటుతనం ఆధారంగా జాబితాను విభజించాలే తప్ప మతపరంగా కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం మైనారిటీల్లో వెనుకబాటుతనం దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ల కసరత్తు జరగలేదని పేర్కొన్నారు.

జాబితా నిర్మాణం మతపరంగా కాకుండా వెనుకబాటుతనం ఆధారంగా జరగాలని సూచించారు. మైనారిటీలకు 4.5 శాతం సబ్‌కోటాను కేటాయించడానికి మైనారిటీల జనాభా గణాంకాలు లేవన్నారు. రంగనా«థ మిశ్రా కమిషన్ రిపోర్టు నాటికి జాబితాలో 2,159 కులాలు, వర్గాలు ఉన్నాయని, దీంట్లో 76 మైనారిటీ వర్గాలకు చెందినవారు కాగా, హిందూ మతానికి చెందిన 2,083 కులాలు ఉన్నాయి. ఈ దామాషాలో తీసుకున్నప్పుడు మైనారిటీలకు 0.95 శాతం వరకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. అదికూడా వారి వెనుకబాటు తనం గుర్తించినప్పుడే వీలవుతుందని పేర్కొన్నారు.

మండల్ కమిషన్ గుర్తించిన ఓబీసీ జాబితా, రాష్ట్రాలు గుర్తించిన జాబితాలోని కామన్ కులాలతో జాతీయ బీసీ కమిషన్ ఒక జాబితాను సిద్ధం చేస్తుందని, కమిషన్ సిఫార్సుల మేరకు ఎప్పటికప్పుడు ఈ జాబితా సవరణ జరుగుతూ ఉంటుందని కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Centre will move the Supreme Court against the Andhra Pradesh High Court order quashing 4.5% 'minority quota', faulting the key arguments given by the court to scrap UPA's policy intervention for welfare of the poor among religious minorities.
Please Wait while comments are loading...