జగన్ కస్టడీ, క్వాష్ పిటిషన్లపై రేపు హైకోర్టు నిర్ణయం

వైయస్ జగన్ సిబిఐ కస్టడీ పిటిషన్‌పై, ఆయన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం సాయంత్రం వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. తీర్పును ఎప్పుడు వెలువరించేది తెలియజేయకుండా బెంచ్ దిగిపోయారు. ఆ తర్వాత మళ్లీ బెంచ్‌పైకి వచ్చి రేపు నిర్ణయం ప్రటిస్తామని చెప్పారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. హైకోర్టుకు వైయస్ జగన్ సతీమణి భారతి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి హైకోర్టుకు వచ్చారు.
జగన్ జ్యుడిషియల్ రిమాండ్ కేవలం 9 రోజులు మాత్రమే ఉందని చెబుతూ జగన్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ హైకోర్టును కోరింది. జగన్‌పై కచ్చితమైన ఆధారాలున్నాయని సిబిఐ వాదించింది. జగన్ అరెస్టులో ఏ విధమైన గందరగోళం లేదని చెప్పింది. పెట్టుబడుల వ్యవహారంపై జగన్‌ను విచారించాల్సి ఉందని సిబిఐ చెప్పింది. మోపిదేవిని, విజయసాయి రెడ్డిలను విచారించినప్పుడు పలు విషయాలు ముందుకు వచ్చాయని, వాటిపై జగన్‌ను విచారించాల్సి ఉందని చెప్పింది. మూడు రోజుల పాటు విచారణలో జగన్ ఏమీ చెప్పలేదని తెలిపింది.
కాగా, వైయస్ జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం సాయంత్రం డిస్మిస్ చేసింది. సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ సిబిఐ కోర్టు జగన్‌కు బెయిల్ నిరాకరించింది. పార్లమెంటు సభ్యుడు అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. బెయిల్ ఇస్తే జగన్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందనే సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.












Click it and Unblock the Notifications