హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ నిందితుడే, జగన్‌కు లబ్ధి: ఛార్జీషీట్‌లో సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకే విశాఖపట్నంలోని రాంకీ ఫార్మాసిటీకి లబ్ధి చేకూర్చేలా గ్రీన్ బెల్టును కుదించారని సిబిఐ తన మూడో ఛార్జీషీటులో పేర్కొంది. వైయస్ తప్పు చేశారని సిబిఐ తేల్చి చెప్పింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 11 ప్రకారం నేరానికి పాల్పడినట్లు స్పష్టం చేసింది. రాంకీకి మేలు చేసేందుకు నాటి వుడా వైయస్ చైర్మన్ వెంకట్రామి రెడ్డితో కలసి ఘోరమైన నేరానికి పాల్పడ్డారని.. వుడా మాస్టర్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘించి, గ్రీన్ బెల్ట్‌ను కుదించి రాంకీ ఫార్మాసిటీ లేఔట్ ప్రణాళికను ఆమోదించారని తెలిపింది.

దీని వల్ల రాంకీ సంస్థకు 914 ఎకరాలు మిగిలాయని... 133 కోట్ల రూపాయల అయాచిత లబ్ధి చేకూరిందని వివరించింది. దీనికి ప్రతిఫలంగానే రాంకీ గ్రూపు నుంచి జగన్‌కు పెట్టుబడుల రూపంలో రూ.10 కోట్ల ముడుపులు ముట్టాయని తెలిపింది. గత నెల 7వ తేదీన దాఖలు చేసిన చార్జిషీటులో వైయస్ - రాంకీ రహస్య బంధాన్ని తెలిపింది. జగన్ పత్రిక పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించకముందే రాంకీ సంస్థ పెట్టుబడుల రూపంలో రూ.పది కోట్లు పెట్టినట్లు సిబిఐ వెల్లడించింది.

జగన్, విజయ సాయి రెడ్డి ఎలాంటి హేతుబద్ధత లేకుండా జగతి షేరు ధరను 360 రూపాయలుగా నిర్ణయించారని, కేవలం లంచాల సొమ్ము దండుకునేందుకు ఇలా చేశారని, క్విడ్ ప్రో కో కింద అయోధ్య రామిరెడ్డికే చెందిన టిడబ్ల్యుసీ, ఎరెస్ సంస్థలు జగతిలో పెట్టుబడులు పెట్టాయని, జగతి పబ్లికేషన్ వరుసగా భారీ నష్టాలు చవిచూస్తున్నట్లు ఐటి శాఖకు సమర్పించిన నివేదికలే తెలుపుతున్నాయని, ఈ నష్టాల వల్ల షేరు క్యాపిటల్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని సిబిఐ తన చార్జిషీటులో వివరించింది.

ఫార్మా సెజ్‌లో కొన్ని దొంగ డాక్యుమెంట్లు సృష్టించడంతోపాటు బినామీ పేర్లతో సబ్ కాంట్రాక్టులు కేటాయించినట్లు/భూ లావాదేవీలు నిర్వహించినట్లు చూపించారని తెలిపింది. నిజంగా పెట్టుబడు లు పక్కాగా ఉన్నట్లయితే ఇలాంటి మోసాలకు పాల్పడాల్సిన అవసరంలేదని చార్జిషీట్‌లో వివరించింది. రాంకీ ఎస్టేట్స్ నుంచి ఎరెస్ కు 'భూమి అడ్వాన్స్' పేరిట 2008 ఫిబ్రవరి 14న చెక్కుద్వారా రూ.8 కోట్లు అందగా... అదే రోజు, అదే మొత్తం ఎరెస్ నుంచి జగతిలోకి పెట్టుబడిగా వెళ్లిందని తెలిపింది. ఎరెస్ డైరెక్టర్లుగా ఉన్న రాజశేఖర రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఇద్దరూ అయోధ్య రామిరెడ్డికి సన్నిహిత బంధువులని తెలిపింది.

వీరిద్దరికీ తమ సొంత ఊరిలో పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆరు ఎకరాలు తప్ప ఎలాం టి భూములూ లేవని, ఇలాంటి పేద రైతులు ఎరెస్ ప్రాజెక్టు పేరిట హైదరాబాద్‌లోని యాక్సిస్ బ్యాంకు లో ఖాతా తెరిచారని వివరించింది. జగతిలో పెట్టుబడులు పెట్టిన టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రాదీ అదే కథ అని పేర్కొంది. అయోధ్య రామి రెడ్డికి సంబంధించి మేడా సాంబశివా రెడ్డి, అల్లా వెంకట రెడ్డి డైరెక్టర్లుగా టీడబ్ల్యూసీ ఏర్పాటైందని, ఈ సంస్థ బేగంపేట యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఖాతా తెరిచిందని, అల్లా రామకృష్ణా రెడ్డి ఎంవీ కోటేశ్వర రావు, వి.రోశమ్మ, శంకర్‌రెడ్డి, మస్తాన్‌రెడ్డిల పేరిట వేర్వేరు ఖాతాలు తెరిచారని, వీరిని రాంకీ సబ్ కాంట్రాక్టర్లుగా పేర్కొంటూ చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించారని పేర్కొంది.

తర్వాత వారి ఖాతాల నుంచి చెక్కులద్వారానే సొమ్ము టీడబ్ల్యూసీలోకి వెళ్లిందని, అక్కడి నుంచి జగతికి చేరిందని, నిజానికి.. వీరెవరూ రాంకీలో సబ్ కాంట్రాక్టర్లుగా పనులు చేయలేదని సిబిఐ తెలిపింది. విజయవాడకు చెందిన రోశమ్మను హైదరాబాద్ వాసిగా చూపినట్లు పేర్కొంది. తాను రాంకీలో సబ్‌కాంట్రాక్టు పనులు చేయలేదని, ఆ సంగతులేవీ తనకు తెలియదని, రాంకీ నుంచి తనకు డబ్బులు అందలేదని రోశమ్మ పేర్కొన్నట్లు సిబిఐ వివరించింది.

ఇవన్నీ చూస్తే.. అసలు వ్యక్తులకు తెలియకుండానే, వారి పేరిట ఖాతాలు తెరిచి, డబ్బులు జమ చేసి, అదే డబ్బును టిడబ్ల్యూసికి మళ్లించినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. జగన్‌కు చేసిన మేళ్లకుగాను వైఎస్ హయాంలో విజయ సాయిరెడ్డికి టిటిడి బోర్డులో సభ్యత్వంతోపాటు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బోర్డు డైరెక్టర్ పదవి లభించాయని సిబిఐ తెలిపింది. రాంకీ ఫార్మాసిటీలో గ్రీన్‌బెల్ట్ పరిధిని కుదించటం ద్వారా అంతిమ లబ్ధి చేకూరింది జగన్‌కే అని సిబిఐ స్పష్టం చేసింది.

ఆయన సెక్షన్ 120-బి, 420 ఐపీసీ ప్రకారం నేరానికి పాల్పడ్డారని తేల్చింది. ఫార్మాసిటీ వెలుపల 250 మీటర్లు, బయట 250 మీటర్లను గ్రీన్‌బెల్ట్‌గా పరిగణించాల్సి ఉందని, కానీ... లోపల వదలాల్సిన స్థలాన్ని 250 నుంచి 50 మీటర్లకు తగ్గిస్తూ 2005 నవంబర్ 23న అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. అప్పటి వుడా వైస్ చైర్మన్ వెంకట్రామి రెడ్డి దీన్ని ఆమోదించారని పేర్కొంది. దీనివల్ల రాంకీకి 914 ఎకరాలు మిగిలాయని సిబిఐ పేర్కొంది.

ఫార్మాసిటీ లేఔట్ ఆమోదానికి పూర్తి బాధ్యత వెంకట్రామి రెడ్డిదేనని తేల్చింది. ఈ చర్యల ద్వారా ఆయన అవినీతి నిరోధక చట్టం, 1988లోని 13(2), 13(1)(సి), (డి), 120బి, 409 ఐపిసి సెక్షన్ ప్రకారం నేరానికి పాల్పడ్డారని సిబిఐ పేర్కొంది. జగతిలో పెట్టుబడి పెట్టిన రాంకీ గ్రూప్ అనుబంధ సంస్థలు టిడబ్ల్యూసి, ఎరెస్‌లకు ఎలాంటి డివిడెండ్లు చెల్లించలేదని తెలిపింది. అది పెట్టుబడి కాదని... ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనానికి ఫలితంగా ఇచ్చిన లంచమని చెప్పేందుకు ఇదే నిదర్శనమని పేర్కొంది.

English summary
CBI is show in his third chargesheet that, late YS Rajasekhar Reddy is also accused in Ramky issue. CBI filed third chargesheet on 7th of May in YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X