కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా తప్పు వల్లే, సారీ: చిరంజీవి, ఒప్పుకున్నారన్న కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కర్నూలు: తన పొరపాటు వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి మంగళవారం అన్నారు. ఆయన కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను చేసిన తప్పు వల్లే ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఇప్పుడు దానిని సరిదిద్దుకునే అవకాశమొచ్చిందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చట్టానికి అతీతుడేమీ కాదన్నారు.

చిన్న తప్పు చేస్తేనే కఠినంగా శిక్షిస్తారని, అలాంటిది వేలకోట్లు దోచుకున్న జగన్‌ను అరెస్టు చేస్తే తప్పా అని ప్రశ్నించారు. 2009లో శోభా నాగి రెడ్డిని మహిళ కదా అని నమ్మి టిక్కెట్ ఇస్తే ఆమె తనతో పాటు ఈ నియోజకవర్గం ప్రజలను మోసం చేశారన్నారు. ఆమెకు ఈ ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాను చేసిన తప్పుకు తనను మన్నించండని కోరారు. అప్పుడు గెలిచిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలలో పదిహేడు మంది తనతోనే ఉన్నారని, శోభా ఒక్కరే వెళ్లారన్నారు. జగన్ అరెస్టు వెనుక కుట్ర ఉందని చెప్పడం సరికాదన్నారు.

జగన్ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకొని జగన్ లక్షల కోట్లు సంపాదించుకున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల నిరు పేదలు రోడ్డున పడ్డారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసుకు ఓటేస్తే అవినీతికి పట్టం కట్టినట్లే అన్నారు.

వైయస్ జగన్ పార్టీకి భవిష్యత్తు లేదని కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ అన్నారు. విజయమే లక్ష్యంగా పని చేస్తున్నామని, అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉండదని స్పష్టం చేశారు. 2014లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జగన్ పైన తాను నెల్లూరులో చేసిన వ్యాఖ్యలు మీడియా సరిగా అర్థం చేసుకోలేదన్నారు.

ఉర్దూలో మాట్లాడటం వల్లనే ఈ సమస్య వచ్చిందన్నారు. జగన్ కాంగ్రెసులో ఉంటే ఏ స్థాయిలోనైనా ఉండేవారని తాను చెప్పానని, అయితే అక్రమాలు వెలుగులోకి వస్తే మాత్రం ఏ పదవిలో ఉన్నా జైలుకు వెళ్లే వాడన్నారు. దేశంలో కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు జైళ్లకు వెళ్లారని, వారి పదవులు వారి అక్రమాలు రుజువు చేసేందుకు అడ్డు కాలేదన్నారు. జగన్ విషయంలోనూ అదే జరిగేదని అభిప్రాయపడ్డారు. సిఎం కిరణ్ మాట్లాడుతూ.. చిరు ఇంతకుముందే తాను చేసిన తప్పిదం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారని, ఇప్పుడు ఓటర్లు అదే తప్పు చేయకుండా కాంగ్రెసును గెలిపించాలని కోరారు.

మనిషి ప్రాణానికి విలువ తెలియని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదవాని గొంతుకు ఈ నియోజకవర్గంలో ఇన్నాళ్లు విలువ లేదని, ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తే శాంతియుతంగా ఉంటుందన్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రం ద్వారా కసాయి వాళ్లకు బుద్ధి చెప్పండని సూచించారు. సాక్షి పేపర్లో అన్నీ అబద్దాలే వస్తాయన్నారు. వైయస్ జగన్‌ను సిబిఐ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటే అరెస్టు చేయలేదని, లక్షల కోట్లు దోచుకున్నందుకు అరెస్టు చేసిందని మండిపడ్డారు.

పరిటాల రవీంద్ర హత్య కేసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి... జగన్ పైన సిబిఐ విచారణ జరిపించారని అప్పుడు ఎందుకు కాంగ్రెసు కక్ష కట్టిందని అడగలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసును, పిల్లనిచ్చిన మామ స్వర్గీయ నందమూరి తారక రామారావును మోసం చేశారని, జగన్ కూడా కాంగ్రెసును మోసం చేశారన్నారు. వైయస్ బతికి ఉంటే కాంగ్రెసు పార్టీలోనే ఉండేవారని, ముఖ్యమంత్రిగా ఉండేవారన్నారు. ఆయన కంపెనీల్లోకి అక్రమ సొమ్ము రాకపోతే నిరూపించుకోవాలన్నారు.

English summary
Rajya Sabha Member Chiranjeevi said Allagadda bypoll his him mistake. He campaign in Allagadda of Kurnool district on Tuesday with Ghulam Nabi Azad and chief minister Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X