ఢిల్లీలో మిత్రుల కోసం వైయస్ జగన్ ప్రయత్నాలు

గత నెల 27వ తేదీన జగన్‌ను అరెస్టు చేసిన తర్వాత పెద్దగా స్పందన రాకపోవడం పట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అందుకు తనను రాజకీయ నేతలు సీరియస్ తీసుకోకపోవడమో, శానససభలో, పార్లమెంటులో తగిన బలం లేకపోవడమో కారణమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో జగన్ చాలా చిన్నవాడనే భావన జాతీయ స్థాయి నాయకుల్లో ఉండడం కారణం కావచ్చునని అంటున్నారు.
ఉప ఎన్నికల్లో తన సత్తా ఏమిటో తెలిసి వస్తుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను లెక్క చేయకుండా తనను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారనే విషయాన్ని ఆయన జాతీయ స్థాయి నాయకులకు చాటాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 శానససభా నియోజకవర్గాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
రాజకీయ కక్షతోనే వైయస్ జగన్‌ను అరెస్టు చేశారనే విమర్శలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావించినట్లు చెబుతున్నారు. బిజెపి జాతీయ నాయకులు కాస్తా గొంతెత్తడానికి ప్రయత్నించారు. అయితే, రాష్ట్రంలోని పరిస్థితుల వల్ల బిజెపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మేనకా గాంధీ మాత్రం వైయస్ విజయమ్మకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, జగన్ ఆశించిన స్థాయిలో తన అరెస్టుపై ఆగ్రహం వెల్లువెత్తలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications