గాలి బెయిల్ డీల్: పట్టాభిపై ఎసిబి కేసు నమోదు

ముడుపులు తీసుకుని గాలి జనార్దన్ రెడ్డికి పట్టాభి రామారావు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంపై హైకోర్టు ఎసిబి విచారణకు అప్పగించింది. ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఆడియో, వీడియో ఆధారాలను కూడా సేకరించింది. పట్టాభి సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వమే జీతం చెల్లిస్తుంది.
ఆయనను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగిగానే భావించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకున్న కేసుల్లో మాత్రమే సిబిఐ కేసులు నమోదు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి సంగతి ఎసిబియే చూస్తుంది. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సిబిఐ హైకోర్టుకు మొత్తం పరిస్థితిని వివరించింది. చివరికి, ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎసిబికి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం సాయంత్రం హైకోర్టు నుంచి కేసు ఫైలు ఎసిబికి అందింది. వెంటనే ఎసిబి లీగల్ సెల్ నిపుణులు దీనిని అధ్యయనం చేశారు. తమకు అందిన సమాచారాన్ని మొదటి నుంచి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్‌కు సిబిఐ నివేదిస్తూనే ఉంది. బెయిల్ బేరసారాలపై సిబిఐ పక్కా ఆధారాలు సేకరించినందున ఎసిబి పని సులువైనట్లే. మరోవైపు, ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసినప్పటికీ, సిబిఐ దర్యాప్తు కూడా కొనసాగవచ్చని న్యాయవాద వర్గాలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications