హైకోర్టులో విజయ సాయిరెడ్డికి ఊరట, సిబిఐకి ఝలక్

విచారణ సందర్భంగా హైకోర్టు సిబిఐకి హితబోధ చేసింది. అక్రమాస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ఇప్పటి వరకు సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు రుజువులు లేవని చెప్పింది. సిబిఐ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాలని సూచించింది. సిబిఐ దర్యాఫ్తు ఏ కేసు అయినప్పటికీ పారదర్శకంగా సాగాలని తెలిపింది. అదే సమయంలో విజయ సాయి రెడ్డికి కొన్ని సూచనలు చేసింది. సిబిఐ దర్యాఫ్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని తెలిపింది.
ప్రొఫెషనల్స్ విలువలకు కట్టుబడి ఉండాలని సూచించింది. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దని చెప్పింది. ఆర్థిక నేరాలు దేశ ప్రతిష్టను భ్రష్టు పటిస్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా విజయ సాయి రెడ్డి ఏప్రిల్ 13వ తేదిన బెయిల్ పైన విడుదలయిన విషయం తెలిసిందే. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టులను తమకు అప్పగించాలని కోర్టు విజయ సాయిరెడ్డిని ఆదేశించింది. హైదరాబాదు విడిచి వెళ్లరాదని కోర్టు ఆయనకు షరతు విధించింది.
అదే విధంగా ఇద్దరు వ్యక్తులతో రూ. 25 వేల రూపాయలేసి పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత పలుమార్లు విజయ సాయి రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత సిబిఐ హైకోర్టుకు వెళ్లడంతో 23న విజయ సాయి మళ్లీ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత 30వ తేదిన మరోసారి బెయిల్ పైన విడుదలయ్యారు. దీంతో సిబిఐ ఆయన బెయిల్ పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ అనంతరం బుధవారం(ఈరోజు) హైకోర్టు సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఇది విజయ సాయికి ఊరట అని చెప్పవచ్చు.
మరోవైపు ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు గాలి జనార్ధన్ రెడ్డికి సూచించింది. ఇటీవల గాలికి ఓఎంసి కేసులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications