14వరకు మన్మోహనే ప్రధాని: మమతకు కాంగ్రెస్ కౌంటర్

రాష్ట్రపతి అభ్యర్థి పరిశీలనలో మన్మోహన్ పేరు లేదని, అలాంటప్పుడు మమతా బెనర్జీ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీలను తమ పార్టీ పరిశీలిస్తుందన్నారు. మిత్ర పక్షాలతో అభ్యర్థిత్వంపై చర్చ జరుపుతున్నట్లు చెప్పారు. వీరిద్దరిలోనే ఎవరినో ఒకరిని ప్రతిపాదించే అవకాశముందని చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కాంగ్రెసు పార్టీ స్టాండ్‌లో ఎలాంటి మార్పు లేదన్నారు.
ప్రణబ్, హమీద్ పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదన్నారు. మమత, ములాయం సూచించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కమ్యూనిస్టు నేత సోమనాథ్ ఛటర్జీ పేర్లను కాంగ్రెసు పార్టీ తిరస్కరించిందని చెప్పారు. మూడో వ్యక్తి మన్మోహన్ సింగ్ ప్రధానిగా కొనసాగుతున్నారని చెప్పారు. యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు ప్రకటిస్తారని చెప్పారు.
కాగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌లు బుధవారం రాత్రి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవి కోసం కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను వారు తిరస్కరించారు. ములాయం సింగ్, మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారి మీడియాతో మాట్లాడారు.
తాము రాష్ట్రపతి అభ్యర్థులుగా ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. తమ తొలి ప్రాధాన్యత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, రెండో ప్రాధాన్యతగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మూడో ప్రధాన్యతగా కమ్యూనిస్టు నేత సోమనాథ్ ఛటర్జీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పారు. కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ అన్సారీ పేర్లను తమకు సూచించిందని చెప్పారు. అయితే తాము మాత్రం వారి కంటే వీరి వైపు మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. దీనిపై జనార్దన్ ద్వివేది గురువారం స్పందించారు.












Click it and Unblock the Notifications