ప్రణబ్‌కు పెరుగుతున్న మద్దతు, అన్నాహజారే కితాబు

ఎన్డీయేలోని కొన్ని పక్షాలు క్రమంగా ప్రణబ్‌కు మద్దతు పలుకుతున్నాయి. గత ఎన్నికలలో కూడా ఎన్డీయేను కాదని.. మహారాష్ట్రకు చెందిన మహిళ అన్న పేరుతో యూపిఏ అభ్యర్థి ప్రతిభా పాటిల్‌వైపే మొగ్గుచూపిన శివసేన అధినేత బాల్‌ఠాక్రే.. ఇప్పుడు ప్రణబ్‌కు మద్దతిస్తున్నట్లు తమ పార్టీ పత్రిక సామ్నాలో ప్రకటించారు. మనమంతా ఐకమత్యంగా ఉన్నట్లు నిరూపించుకోవాలని, ఆయనను రాష్ట్రపతి భవన్‌కు ఏకగ్రీవంగా పంపాలని చెప్పారు.
సోమవారం ప్రణబ్ ముఖర్జీ ఫోన్ చేయగా, బాల్‌ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ నిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా దాదాకు హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో తనతో సహా ఇద్దరు సభ్యులున్న జార్ఖండ్ వికాస్ మోర్చా అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కూడా ప్రణబ్‌కు మద్దతు పలికారు. సంగ్మాకు ఆయన సొంత పార్టీ కూడా మద్దతు పలకట్లేదన్నారు.
ఇక రాష్ట్రపతి పదవికి ప్రణబే సరైన అభ్యర్థి అని కేంద్ర మంత్రి నారాయణసామి చెప్పగా, ముఖర్జీ విజయం కోసం చాలా ఉద్వేగంగా ఎదురుచూస్తున్నట్లు సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. తమిళనాడు అసెంబ్లీలో 29 మంది సభ్యులతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డిఎండికె రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తమిళనాడు ప్రజలు ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నా వారిని కేంద్రం మోసగిస్తూనే ఉందని పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ చెప్పారు.
ఎన్డీయే పక్షాలలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నా.. బిజెపి మాత్రం రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరగకూడదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కలాం ఎటూ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఇక బరిలో నిలిచిన ఎన్సీపీ నేత సంగ్మాకు మద్దతిచ్చే యోచనలో కనిపిస్తోంది. సంగ్మాను తమ సంయుక్త అభ్యర్థిగా ప్రకటింపజేసేందుకు అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత, బిజెడి చీఫ్ నవీన్ పట్నాయక్‌లను కూడా దువ్వేందుకు బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ ప్రయత్నిస్తున్నారు.
కూటమి భాగస్వాములలో ఇతరులను కూడా సంగ్మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. పోటీచేస్తే చర్యలు తప్పవని ఎన్సీపీ అధిష్ఠానం సంగ్మాను హెచ్చరించడంతో, ఆయన కూడా చిట్టచివరి నిమిషంలో విరమించుకుంటే ఏం చేయాలో ఆలోచించుకోవాలని పార్టీపెద్దలకు అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సూచించారు. కాగా, ప్రణబ్‌ను బలపర్చాలంటూ బిజెపి అధిష్ఠానానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సూచించారు.
ప్రణబ్‌కు మద్దతు పెరుగుతున్న దృష్ట్యా ఇక కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీని శాంతపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మమత ఇప్పటికీ తమ భాగస్వామేనని, ఎప్పటికీ అలాగే ఉంటారని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి షకీల్ అహ్మద్ చెప్పారు. మరోవైపు నిన్నటి వరకూ ప్రణబ్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన అన్నాహజారే ఆయనకు అనుకూలంగా మాట్లాడారు. యూపిఏలోని ఇతర మంత్రుల కంటే ప్రణబ్ కాస్త మెరుగైన వ్యక్తేనని కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications