ఎపి అపైర్స్: చెప్పింది సోనియా గాంధీ వింటున్నారు

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ఢిల్లీకి క్యూ కట్టారు. రాష్ట్ర నాయకులు చెప్పిందంతా సోనియా గాంధీ వింటున్నారు. కానీ ఏమీ మాట్లాడడం లేదు. రాష్ట్ర నాయకులు చెప్పిన విషయాలను ఆమె నోట్ చేసుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వ మార్పు ఉండవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో నాయకుల వద్ద నోరు విప్పకపోవడంతో ఆమె మనసులో ఏముందు పసిగట్టలేకపోతున్నారు.

సోనియా గాంధీని ఈ సమయంలో కలుసుకోవడం రాష్ట్ర నాయకులకు చాలా సులభంగా మారింది. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి నాయకుడికీ దాదాపు ఆమె అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి మాటలను ఆమె వింటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇది వరకే సోనియాను కలిసి నివేదికలు సమర్పించారు. తమ వాదనలను విడివిడిగా వినిపించారు. కాస్తా ఊపు మీదున్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం సోనియాను కలిసి తన తరఫు వాదనను వినిపించారు.

ఢిల్లీ వచ్చిన రాష్ట్ర కాంగ్రెసు నాయకులు యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని కలుస్తూ సోనియాతో భేటీ అవుతున్నారు. చిరంజీవి తర్వాత బుధవారం సాయంత్రం సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోనియాతో సమావేశమయ్యారు. చిరంజీవి, కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాణలకు చెందిన మూడు గ్రూపులకు చెందిన నాయకులు సోనియా వద్ద తమ వాదనలను వినిపిస్తున్నారు.

రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉంటుందా, లేదా అనే విషయంపై సోనియా గాంధీ నుంచే కాకుండా అధిష్టానానికి చెందిన ఇతర నాయకుల నుంచి కూడా రాష్ట్ర నాయకులకు ఉప్పు అందడం లేదు. ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అడుగుతున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎందుకు విజయం సాధించారని ప్రశ్నిస్తున్నారని, తెలంగాణపై అభిప్రాయం కోరుతున్నారని, వాటిపై తాము మాట్లాడే విషయాలను సోనియా, ఇతర పెద్దలు వింటున్నారని, వాటిపై వారు ఏమీ మాట్లాడడం లేదని రాష్ట్ర నాయకులు అంటున్నారు.

రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ సోనియా గాంధీని కలిశారు. కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. ఆయన కాంగ్రెసు పరిస్థితిపై, తెలంగాణ అంశంపై ప్రధానంగా వారికి వివరించినట్లు చెబుతున్నారు. అయితే, తాను సోనియాకు ఏ విధమైన నివేదిక ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెసు నాయకులు చాలా మంది ఢిల్లీలో మకాం వేశారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఢిల్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి గురువారం ఢిల్లీ వస్తున్నారు.

బుధవారం సాయంత్రం సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా సోనియా గాంధీని కలుసుకున్నారు. రగులుతున్న తెలంగాణను చల్లార్చాలని తాను సోనియా గాంధీకి చెప్పినట్లు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సోనియా చెప్పినట్లు ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు వల్లనే తమ పార్టీ ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించలేపోయిందని తాను సోనియాకు చెప్పినట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలని కూడా చెప్పినట్లు ఆయన చెప్పారు.

రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను వింటున్న సోనియా గాంధీ, అధిష్టానానికి చెందిన ఇతర నాయకులు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తారని, ఆ తర్వాత రాష్ట్రంలో పార్టీని ప్రక్షాళన చేస్తారని అంటున్నారు. తెలంగాణపై కూడా ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. జులై 19వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలపై సోనియా గాంధీ దృష్టి పెడతారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+