జగన్ ఎఫెక్ట్: విభజనపై కదలికా, నాయకత్వ మార్పా?

ఈ ప్రభావం నుండి కాంగ్రెస్ అధిష్టానం కోలుకోలేకపోతోంది. ఓ వైపు తెలంగాణ, మరోవైపు జగన్ కారణంగా ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రానికి చెందిన పలువురు నేతలతో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరుపుతోంది. మూడు ప్రాంతాలకు చెందిన నేతలతో కాంగ్రెస్ పరిశీలకుడు, కేంద్ర మంత్రి వయలార్ రవి జోరుగా చర్చలు జరుపుతున్నారు. జగన్‌ను ఎదుర్కోవడం, తెలంగాణ తేల్చడం, నాయకత్వ అంశం ఈ మూడు అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోందని మాత్రం అందరికీ అర్థమవుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివ రావు నివాసంలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డితో వయలార్ రవి ప్రత్యేక చర్చలు జరిపారు. ఈ భేటీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా హాజరు కావడం గమనార్హం. బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా ఈ భేటీ జరిగింది. తెలంగాణపై ప్రత్యేకంగా ఏమీ చర్చించలేదని వయలార్ రవి పేర్కొన్నప్పటికీ... విభజన దిశగా కేంద్రంలో కదలిక మొదలైనట్లు తెలుస్తోంది.
తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని, ఈసారి స్పష్టమైన ఫార్ములా రూపొందించాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో... వయలార్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రాయల తెలంగాణతోపాటు పలు ప్రతిపాదనలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో ఘోరపరాజయం నేపథ్యంలో... ఏ ఫార్ములాను ఖరారు చేస్తే జగన్ పార్టీని ఢీకొనగలమన్న అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలతో జరపనున్న చర్చల్లోనూ తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీలో పార్టీ పెద్దలు వారం రోజులుగా రాష్ట్రం నుంచి వచ్చిన నేతలందర్నీ కలుసుకుని వారి మనోగతాన్ని తెలుసుకుంటున్నారు. బుధవారం కూడా ఈ పరంపర కొనసాగింది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి సోనియాను కలిశారు. రాష్ట్రంలో అస్థిరతను తొలగించాలని, భారీగా కుల, వర్గ సమీకరణలు జరపాలని, విభజన సమస్యపై జాప్యం చేయకుండా ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొనాలని, ఈసారి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యమేనని పలువురు నేతలు సోనియాకు చెప్పినట్లు తెలిసింది.
విభజన రావణకాష్టాన్ని ఆర్పాలని తాను కోరినట్లు జెసి చెప్పారు. అది త్వరలోనే ఆరుతుందని ఆమె చెప్పారన్నారు. తెలంగాణకు పరిష్కార మార్గం ఖరారైతే నాయకత్వ మార్పు కూడా సహజంగానే జరుగుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సోనియాతో భేటీ అనంతరం కనుమూరి విలేకరులతో మాట్లాడారు. తన లోక్‌సభ నియోజక వర్గ పరిధిలోని నరసాపురంలో కాంగ్రెస్ గెలుపు పట్ల సోనియా హర్షం వ్యక్తం చేశారని, ఎవరినీ నిందించకుండా, అభివృద్ధే అజెండాగా, నాయకులంతా కలసికట్టుగా పనిచేసినందునే గెలుపు సాధ్యమైందని తెలిపారు.
జగన్ అరెస్టు కారణంగా సానుభూతి ఏర్పడిందని, పార్టీ ఓటమికి అదే కారణమని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. తమ తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో తాము పూర్తిగా నిమగ్నం అవుతామని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. మరోవైపు రాష్ట్ర పరిస్థితుల్ని అధిష్ఠానానికి వివరించేందుకు వస్తున్న నాయకులంతా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితోనూ భేటీ అవుతున్నారు. జైపాల్ నివాసంలో నాయకుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
బుధవారం మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, సుదర్శన్ రెడ్డి, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మంత్రి జేసీ వేర్వేరుగా జైపాల్‌తో భేటీ అయ్యారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ఎండీఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఆదివారం జపాన్ వెళ్లనున్నారు.
నాలుగురోజుల అధికారిక పర్యటనలో భాగంగా జపాన్‌లోని పలు నగరాలను సందర్శిస్తారు. తెలంగాణ ఇవ్వాలా, రాయలసీమతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలా, మూడు రాష్ట్రాలుగా విభజించాలా లేక ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలా అనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతిమంగా పార్టీకి లబ్ధి చేకూరే దిశలో వారు నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications