రాయల తెలంగాణ వద్దు, సీమాంధ్రదే...: కోదండరామ్

తెలంగాణ కాంగ్రెసు నాయకులు రాయల తెలంగాణ ప్రతిపాదన తేవడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణ యువకుల త్యాగాలు రాయల తెలంగాణ కోసం కాదని, తెలంగాణ కోసం మాత్రమేనని ఆయన అన్నారు. హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మాత్రమే తాము అంగీకరిస్తామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని ఆయన తెలంగాణ జిల్లాల ప్రజలకు సూచించారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెసు నాయకుల దిష్టిబొమ్మలు దగ్ఘం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీమ నాయకులతో కాంగ్రెసు శానససభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి కుమ్మక్కై రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే నెల 7వ తేదీన జెఎసి స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ కోసం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసినవారిని ద్రోహులుగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.
తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, తెలంగాణ ఏర్పాటే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి గురువారం నల్లగొండలో అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications