పాక్ జైలు నుంచి 30 ఏళ్ల తర్వాత సుర్జీత్ విడుదల

తనను విడుదల చేసినందుకు ఆనందంగా ఉందని సుర్జీత్ జైలు వెలుపల నిరీక్షిస్తున్న మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను తన పిల్లలను ఆలింగనం చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నానని, ఆ తర్వాత స్వర్ణదేవాలయాన్ని సందర్శిస్తానని ఆయన చెప్పారు. సుర్జీత్ 30 ఏళ్ల పాటు జైల్లో ఉన్న కాలంలోనే ఆయన కుమారుడు మరణించాడు. మరో కుమారుడికి పెళ్లయింది. అతనికి పిల్లలు కూడా పుట్టారు.
సుర్జీత్ సింగ్‌ను పాకిస్తాన్ పోలీసులు వాఘా సరిహద్దు వరకు తీసుకుని వచ్చారు. గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో సుర్జీత్‌ను భారత అధికారులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు, ఫిరోజ్‌పూర్ గ్రామ ప్రజలు సుర్జీత్‌కు ఆహ్వానం పలకడానికి వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. సుర్జీత్ పాకిస్తాన్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన కుమారుడు కుల్వీందర్ సింగ్‌కు మూడేళ్ల వయస్సు. సుదీర్ఘ కాలం గడిచిపోయిందని, తను తండ్రిని చూడడానికి ఆతురత పడుతున్నానని కుల్వీందర్ సింగ్ అన్నారు.
పాకిస్తాన్ సైనిక చట్టం ప్రకారం సుర్జీత్ సింగ్‌కు మరణశిక్ష విధించారు. ఆయన 1982లో అరెస్టయ్యారు. సుర్జీత్ జీవించి ఉన్నాడా, లేడా అనే విషయం కూడా 2005 వరకు కుటుంబ సభ్యులకు తెలియదు. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ 1989లో సుర్జీత్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. సుర్జీత్ సింగ్ విడుదలపై వివాదం కూడా చెలరేగింది.
మరో ఖైదీ సరబ్జిత్ సింగ్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్, భారత మీడియా తెలిపింది. వార్తాకథనాలు వచ్చిన 8 గంటల తర్వాత సరబ్జిత్ సింగ్‌ను విడుదల చేయడం లేదని, సుర్జీత్ సింగ్‌ను విడుదల చేస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications