సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సేఫ్, సోనియా త్రయం కసరత్తు

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవికి ఢోకా లేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చకుండానే రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్ది, పార్టీని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా మార్చకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. వారిద్దరినీ మార్చకుండానే ఇతర నాయకులను, ముఖ్యంగా పార్లమెంటు సభ్యులను సమన్వయం చేసి కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో పార్టీని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో పడినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజయ్య, పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. సోనియా, రాహుల్, ఆజాద్ రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెట్టారని వారు మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డిని, బొత్సను మార్చకుండా అవసరమైన కార్యాచరణను రూపొందించడంతో పాటు తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే పార్టీని గాడిలో పెట్టడం సులభమవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ సీట్లు సాధించడానికి సానుభూతే కారణమని రాష్ట్ర నాయకులతో పాటు సోనియా గాంధీ, ఆజాద్ కూడా భావిస్తున్నారు. ఆ సానుభూతి క్రమంగా తగ్గుతుందని, 2014 నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలహీనపడుతుందని అనుకుంటున్నట్లు సమాచారం.

దానికితోడు, ఓదార్పు యాత్ర, తదితర కార్యక్రమాలతో వైయస్ జగన్ రాష్ట్రంలో, ముఖ్యంగా సీమాంధ్రలో విస్తృతంగా పర్యటించారని, దాదాపు ఇంటింటి ప్రచారం చేపట్టారని, దానివల్ల కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లాభపడిందని అనుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు ఎక్కడికక్కడ పర్యటనలు చేస్తూ ప్రజల ముందుకు వెళ్తే పరిస్థితి కాంగ్రెసుకు అనుకూలంగా మారుతుందని కూడా అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి రాహుల్ గాంధీ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులతో వరుసగా చర్చలు జరుపుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా సోనియా గాంధీ ఈసారి రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతి పార్టీ నాయకుడికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వారు చెప్పేదంతా విన్నారు. రాష్ట్రానికి చెందిన చాలా మంది నాయకులు ఢిల్లీ వెళ్లి తమ వాదనలను సోనియాకు, అధిష్టానం పెద్దలకు వివరించారు. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి, పార్టీకి కాయకల్ప చికిత్స చేసే మార్గాలను సోనియా గాంధీ త్రయం అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, పనిలో పనిగా తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించే పనిలో ఆ ముగ్గురు పడినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని మారిస్తే కొత్త సమస్యలు వస్తాయని, గందరగోళం ఏర్పడుతుందని, 2014 ఎన్నికల వరకు వారిద్దరిని కొనసాగించాలని సోనియా గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, కాంగ్రెసు శ్రేణులను సంతృప్తి పరచదడానికి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మందికి పదవులు దక్కేలా చేస్తే పార్టీలో శ్రేణులు గాడిలోకి రావచ్చునని అంటున్నారు. ఇదే సమయంలో వైయస్ జగన్ వైపు మరింత శాసనసభ్యులు వెళ్లే అవకాశాలు లేవని కూడా కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా అటు వెళ్లాలని అనుకుంటే, వారికి తగిన గ్యారంటీలు, హామీలు ఇచ్చి నిలువరించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+