వైయస్ విజయమ్మ ఢిల్లీ యాత్ర ఆంతర్యం ఏమిటి?

వైయస్ విజయమ్మ మంగళవారం ఢిల్లీకి చేరుకుని, బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలుసకున్నారు. చెప్పాల్సిందంతా చెప్పారు. రేపు గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను కలుస్తారు. సివిసిని కూడా కలిసే అవకాశం ఉంది. వైయస్ జగన్ పట్ల సిబిఐ జరుపుతున్న విచారణపై అనుమానాలు రేకెత్తించడమే పనిగా వైయస్ విజయమ్మ, ఆమెతో పాటు ఢిల్లీ పర్యటన చేస్తున్న నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తమ పార్టీ వైపు జాతీయ నాయకులు దృష్టి సారించేలా చేయడమే విజయమ్మ ఢిల్లీ యాత్రలోనే ప్రధాన ఆంతర్యమని చెబుతున్నారు. ఇప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా జాతీయ మీడియాకే ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగు మీడియాతో మాట్లాడడం కన్నా జాతీయ మీడియాతో మాట్లాడడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల దృష్టిని ఆకర్షించడమే పనిగా ఆయన పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది.
గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇద్దరు శాసనసభ్యులు, ఒక పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఇటీవలి ఉప ఎన్నికల తర్వాత మరో 15 మంది శాసనసభ్యులు, ఓ లోకసభ సభ్యుడు చేరారు. దీంతో జాతీయ రాజకీయాల్లో తాము కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని, భవిష్యత్తులో తాము మెజారిటీ సీట్లను గెలుస్తామని, అందువల్ల జాతీయ స్థాయిలో పార్టీలకు తమ మద్దతు తప్పనిసరి అవుతుందని వివిధ పార్టీలకు సంకేతాలు ఇవ్వడమే విజయమ్మ ఢిల్లీ పర్యటనలోని ముఖ్య ఉద్దేశ్యమని అంటున్నారు.
ముఖ్యంగా, సిబిఐ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలను రూపొందించుకున్నట్లు కూడా అర్థమవుతోంది. రాజకీయ కక్ష కారణంగానే జగన్‌పై సిబిఐ దర్యాప్తు జరుగుతుందనే అభిప్రాయాన్ని మరింత బలోపేతం చేయడం వ్యూహంగా కనిపిస్తోంది. సిబిఐ జెడి లక్ష్మినారాయణ వ్యవహార శైలిని తప్పు పట్టడం ద్వారా సిబిఐ దర్యాప్తు తీరుపై అనుమానాలు రేకెత్తించేలా చేయడం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే విజయమ్మ ఢిల్లీ పర్యటనను ఉద్దేశించినట్లు చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో సిబిఐ నైతికతను ప్రశ్నార్థకం చేయడం ఇందులోని ఉద్దేశమని అంటున్నారు.












Click it and Unblock the Notifications