సెప్టెంబర్‌లోగా రాష్ట్రం వస్తుంది, పోరాటం ఆగదు: కెసిఆర్

Posted By:
Subscribe to Oneindia Telugu
K Chandrasekhar Rao
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తమ పోరాటం ఆగిపోదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలో జరిగిన మాజీ పార్లమెంటు సభ్యులు వడితెల రాజేశ్వర రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆగస్టులో లేదా సెప్టెంబరులో తెలంగాణ తప్పకుండా వస్తుందని చెప్పారు. ఆ విధంగా సూచనలు కేంద్రం నుండి సూచనలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రావడంతోనే తమ పోరాటం ఆగిపోదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందే వరకు కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాగానే పదిగా ఉన్న జిల్లాలను 24గా చేస్తామన్నారు. సాగునీరు అందని 75 నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు.

ప్రతి జిల్లాలో లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వస్తామని చెప్పారు. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఈ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో కెసిఆర్‌తో పాటు ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, రాజయ్య, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, అరవింద్, మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని కెసిఆర్ బుధవారం కూడా అన్న విషయం తెలిసిందే. త్వరలోనే తెలంగాణ ఏర్పడుతుందని, ఇందుకు సంబంధించి తనకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక విజయోత్సవ సభలో ఆయన బుధవారం ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తీరుతుందని, తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. తెలంగాణవాదమే ఈ గడ్డ మీద గెలుస్తుందని తేలిపోయిందని ఆయన అన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత మనం కలలు కన్న సింగరేణి తయారు కావాలని ఆయన అన్నారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెరాస గౌరవం పెరిగిందని ఆయన అన్నారు. సింగరేణిలో కార్మికులకు సదుపాయాలు మెరుగుపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. గెలిచినంత మాత్రాన సరిపోదని, హామీలు నెరవేర్చాలని, సింగరేణి యాజమాన్యానికి తమ సంఘం అంటే ఏమిటో తెలియాలని, యాజమాన్యానికి భయం పుట్టాలని ఆయన అన్నారు.

సమైక్య రాష్ట్రంలో సింగరేణి అభివృద్ధి సాధ్యం కాదని, తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణిలో సదుపాయాలు పెంచడానికి, కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడానికి తాను బాధ్యత తీసుకుంటానని ఆయన చెప్పారు. ఇంతకు ముందటి యూనియన్ల కన్నా బాగా పనిచేద్దామని ఆయన అన్నారు.

సింగరేణి 500 కోట్ల రూపాయల లాభాలతో నడుస్తున్నా కార్మికులకు యాజమాన్యం సదుపాయాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడేది తమ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని ఆయన అన్నారు. పార్టీపరంగా ప్రతి ఆరు నెలలకు ఓసారి సమీక్షా సమావేశం పెట్టుకుందామని ఆయన సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao said on Thursday that their fight will continue even after Telangana state formed.
Please Wait while comments are loading...