• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ ముద్రను చెరిపేయాల్సిందే, మీడియా కూడా

By Srinivas
|

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ప్రభుత్వ పథకాలపై దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముద్రను చెరిపేయాలని, అలా అయితేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బతికి బట్ట కడుతుందని లేదంటే పార్టీకి కష్టాలు తప్పవని నిర్మాణ కమిటీ సూచనలు చేసింది. ఆదివారం మంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో సమావేశమైన ధర్మాన కమిటీ పలు అంశాలపై చర్చించింది. టిజి వెంకటేష్ సహా మరికొందరు కాంగ్రెసు పార్టీకి ప్రత్యేకంగా పత్రిక, ఛానల్ ఉండాలని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. అలాగే పలు సూచనలు చేశారని తెలుస్తోంది.

సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న వైయస్ ముద్రను చెరిపేయాలని, ప్రభుత్వ పథకాలు మాజీ సిఎం వైయస్‌వేనన్న భావన ప్రజల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్‌కు రావాల్సిన గుర్తింపు రాదని, కాబట్టి తక్షణం పథకాలకు సంబంధించి ప్రజల్లో వైయస్‌పై ఉన్న భావనను తొలగించాలని, ఇవి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడం కోసం ఏం చేయాలన్నదానిపై నియమితమైన ధర్మాన కమిటీ ముందు వ్యక్తమైన అభిప్రాయాలు అని తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఏ మీడియాలోనూ పూర్తి స్థాయిలో ప్రశంసలు రావడం లేదన్న ఆవేదన వ్యక్తమైంది. జగన్‌కు ప్రత్యేక మీడియా ఉండడంతో ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ తన తండ్రి వైయస్ హయాంలో చేపట్టినవేనని ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ప్రచారం చేసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సమయంలో మంత్రి టిజి వెంకటేశ్ జోక్యం చేసుకుంటూ కాంగ్రెస్‌కు కూడా ప్రత్యేకంగా ఒక మీడియా ఉండడం మంచిదన్నారు. జగన్ మీడియా కాంగ్రెస్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

అయితే ఈ వాదనతో మరికొందరు మంత్రులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినందున ఆ స్థాయిలో మీడియా సంస్థ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలకు చానళ్లు, పత్రికలు ఉండడం సహజమని వారు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే మీడియా సంస్థలను కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే విధానాన్ని ఆలోచించాలన్న సలహాలను ఇచ్చారు. ఈ సమయంలో మంత్రి రఘువీరా రెడ్డి జోక్యం చేసుకుంటూ కేరళలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఒక మీడియా ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచించారు.

దీనిపై తర్జనభర్జనల అనంతరం మరోసారి పూర్తిస్థాయిలో చర్చించాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా ఈ సమావేశానికి ప్రత్యేకంగా హాజరైన గీతారెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సమయంలో తన మనసులోని ఆవేదనను కూడా వెళ్లగక్కారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులకు.. సహచర మంత్రివర్గం నుంచే సరైన మద్దతు లభించకపోవడంపై ఆమె ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ నిర్ణయాల మేరకే తాము జీఓలు జారీ చేశామని, ఇదంగా సమష్టి నిర్ణయమని ఆమె అన్నారు.

అయితే తమకు అండదండలు అందించాల్సిన సహచర మంత్రులు ఎవరూ సంఘీభావం తెలుపుతూ, నైతిక మద్దతు ఇవ్వకపోవడం తమను కలిచి వేసిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష బలీయంగా ఉందని, ఈ విషయంపై కూడా దృష్టి సారించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడమే గాకుండా గణనీయంగా ఓట్లు తగ్గి పోవడాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. కాగా ఇదేవిధంగా ఈ సమావేశంలో ప్రత్యేకంగా పాల్గొన్న దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ రేషన్ కార్డుల విషయంలో ఇకపై చాలా మార్పులు తీసుకు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు జారీపై నిషేధాన్ని విధిస్తూ పోవడం వల్ల కార్డుల కోసం తిరిగేవారు అసంతృప్తికి లోనవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడున్న విధానాన్ని మార్చి బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేయాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా వికలాంగులకు ప్రస్తుతమున్న 40 శాతాన్ని 30 శాతానికి కుదించాలని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత రావాల్సి ఉందని మంత్రులు గీతారె డ్డి, శైలజానాథ్‌లు అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ రెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో పూర్తిగా పారదర్శకతను పాటిస్తున్నామని, అయినప్పటికీ గుర్తింపు రావడం లేదని శైలజానాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో నిక్కచ్చిగా ఉన్నప్పటికీ ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన కరవవుతోందని, ఉద్యోగాలు పొందిన వారు కూడా కృతజ్ఞతాభావం చూపించడం లేదని పేర్కొన్నారు.

కాగా సమావేశానికి వచ్చి అభిప్రాయాలు వినిపించాల్సిందిగా ధర్మాన కమిటీ మంత్రులను కోరితే ఐదుగురు మంత్రులు మాత్రమే దానికి హాజరయ్యారు. మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, టీజీ, శ్రీధర్‌ బాబు, శైలజానాథ్‌లు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాధాన్యతలపై తమ అభిప్రాయాలు కమిటీకి వెల్లడించారు. కొందరు మంత్రులు వ్యక్తిగత పనులు, ఇందిరమ్మ బాటలో పొల్గొనడం, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

English summary

 The ten member ministers committee that was entrusted the job of suggesting measures for improving the functioning of both Congress party and the state government, will meet party MPs on July 17 and MLAs on July 18 to ascertain their views.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X