Bank Holidays: ఏకంగా 11 రోజులు బ్యాంకులు బంద్!
మే నెల ముగుస్తుండటంతో జూన్ (2026) నెలలో వివిధ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీరు ఈ వార్తను తప్పక చదవాలి. వచ్చే నెలలో బ్యాంకులకు వెళ్లేవారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా వచ్చే వారాంతపు (శని, ఆదివారాలు) సెలవులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, స్థానిక ఆచారాల ఆధారంగా జూన్ నెలలో బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి మీ నగరంలో ఏ రోజు బ్యాంకుకు సెలవు ఉందో ముందుగానే తెలుసుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది.
మొత్తం 11 రోజులు బంద్..
గత నెలలతో పోలిస్తే జూన్ నెలలో బ్యాంకులకు సెలవులు కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. జూన్‌లో వచ్చే నాలుగు ఆదివారాలు, రెండు శనివారాల (రెండవ, నాల్గవ శనివారాలు) సాధారణ సెలవులతో పాటు ప్రాంతీయ సెలవులన్నింటినీ కలుపుకుంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు ప్రతి నెల 2వ, 4వ శనివారాల్లో ప్రభుత్వ సెలవులను పాటిస్తాయి. అయితే, ఈ నెలలో వచ్చే చాలా సెలవులు ప్రాంతీయమైనవి కావడం వల్ల అవి కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలకే పరిమితం కానున్నాయి.

జూన్ 2026 బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా తేదీల వారీగా..
- జూన్ 13 (రెండవ శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.
- జూన్ 15: ఐజాల్ (మిజోరం)లో 'వైఎంఏ డే', భువనేశ్వర్ (ఒడిశా)లో 'రాజా సంక్రాంతి' సందర్భంగా సెలవు.
- జూన్ 17: హర్యానాలో 'మహారాణా ప్రతాప్ జయంతి' సందర్భంగా బ్యాంకులకు విరామం.
- జూన్ 18: పంజాబ్‌లో 'శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరత్వ దినోత్సవం' కారణంగా బ్యాంకులు పనిచేయవు.
- జూన్ 25 (మొహరం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో) మొహరం సందర్భంగా అదనపు సెలవు ఉంటుంది.
- జూన్ 26 (మొహరం/ఆషురా): జూన్ నెలలో అత్యధిక రాష్ట్రాలలో వచ్చే ప్రధాన సెలవు ఇదే. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలతో పాటు అగర్తలా, ఐజాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ వంటి నగరాల్లో ఈ రోజు బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే గుజరాత్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, రాజస్థాన్, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ జూన్ 26 సెలవు వర్తించదు.
- జూన్ 27 (నాల్గవ శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు.
- జూన్ 29: సిమ్లా (హిమాచల్ ప్రదేశ్), హర్యానా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో 'సంత్ గురు కబీర్ జయంతి' సందర్భంగా సెలవు పాటిస్తారు.
- జూన్ 30: ఐజాల్ (మిజోరం)లో 'రెంమ్నా ని' (శాంతి దినం) సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
గమనించాల్సిన రాష్ట్రాలు ఇవే:
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో జూన్ నెలలో ఎలాంటి అదనపు ప్రాంతీయ సెలవులు లేవు. అక్కడ కేవలం సాధారణ శని, ఆదివారాల సెలవులు మాత్రమే వర్తిస్తాయి. రాష్ట్రాల ఆచారాలు, పరిపాలనా నిర్ణయాలను బట్టి ఈ తేదీల్లో స్థానికంగా స్వల్ప మార్పులు ఉండవచ్చు.
బ్యాంకులు మూసి ఉన్నా.. డిజిటల్ సేవలు ఫుల్ ఆన్!
సెలవు దినాల్లో బ్యాంకుల భౌతిక శాఖలు మూసి ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి. యూపీఐ (UPI) లావాదేవీలు, ఏటీఎం (ATMs), మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు 24 గంటలూ నిరంతరాయంగా పనిచేస్తాయి. అయితే, నేరుగా బ్యాంక్ శాఖలకు వెళ్లి చేసుకోవాల్సిన నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్‌లు, పాస్‌బుక్ అప్‌డేట్లు ,కొత్త అకౌంట్ వంటి సేవలు మాత్రం ఈ సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవని కస్టమర్లు గుర్తుంచుకోవాలి. కాబట్టి, అత్యవసర ఆర్థిక లావాదేవీలను ఈ సెలవుల జాబితా ఆధారంగా ముందే ప్లాన్ చేసుకోండి!
గమనిక: బ్యాంకు సెలవులు ఆయా ప్రాంతాల స్థానిక పండగలు, ప్రత్యేక దినాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ వార్తాను వన్ ఇండియా తెలుగు ధృవీకరించడం లేదు. ఇది కేవలం సమాచారం మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పనిదినాల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్ సైట్ లేదా బ్రాంచ్ ను సంప్రదించి తెలుసుకోగలరు














Click it and Unblock the Notifications