మరీ ఘోరం: తెలంగాణ టాప్.. ఏపీ సెకండ్! తేల్చేసిన కేంద్ర నివేదిక!
ఇండియాలో సిజేరియన్(సి-సెక్షన్) ప్రసవాల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగింది. తాజాగా విడుదలైన 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-2023-24' నివేదిక ప్రకారం, దేశంలో జరుగుతున్న మొత్తం ప్రసవాలలో 27.2 శాతం డెలివరీలు సిజేరియన్ల ద్వారానే జరుగుతున్నాయి. అంటే దేశంలో పుడుతున్న ప్రతి నలుగురు పిల్లలలో ఒకరు శస్త్రచికిత్స ద్వారానే జన్మిస్తున్నారు. గత సర్వే (NFHS-5, 2019-21)లో ఈ రేటు 21.5 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది మరింత ఆందోళనకరంగా పెరిగింది.
ప్రైవేట్ ఆరోగ్య రంగంలో ఈ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాలలో ఏకంగా 54.1 శాతం సి-సెక్షన్లే కావడం గమనార్హం. గతంలో ఇది 47.4 శాతంగా ఉండేది. దీనికి భిన్నంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ రంగంలో సిజేరియన్ల రేటు కేవలం 16.9 శాతంగా మాత్రమే నమోదైంది. అటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య కూడా భారీ తేడా కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 40.5 శాతం ప్రసవాలు సిజేరియన్ల ద్వారా జరుగుతుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 22.8 శాతంగా ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను బట్టి చూస్తే ఏ దేశంలోనైనా సిజేరియన్ల రేటు 10 నుంచి 15 శాతం లోపు మాత్రమే ఉండాలి. కానీ భారతదేశ సగటు ఈ పరిమితికి రెండింతలు ఉండగా.. ప్రైవేట్ రంగంలో మాత్రం ఇది కొన్ని రెట్లు ఎక్కువగా ఉంది. అయితే దేశంలో ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య 90.6 శాతానికి పెరగడం, నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది పర్యవేక్షణలో జరిగే ప్రసవాలు 91.3 శాతానికి చేరడం శుభపరిణామం అయినప్పటికీ.. ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు సాధారణ ప్రసవాల కంటే సర్జరీలే ఎక్కువగా కావడం చర్చనీయాంశంగా మారింది.
అనవసరం చేసే సిజేరియన్ల వల్ల తల్లులకు సర్జరీ సంబంధిత నష్టాలు, కోలుకునే సమయం ఎక్కువ కావడం, భారీగా ఖర్చులు అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలోని ఈ భారీ తేడాకు కేవలం వైద్యపరమైన కారణాలే కాకుండా ఇతర ఆర్థిక, వ్యాపార కోణాలు కూడా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నివేదికతో ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగే సి-సెక్షన్లపై ఆడిటింగ్ నిర్వహించాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి రానుంది.
మరోవైపు, దేశంలోనే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సిజేరియన్ డెలివరీలలో మొదటి స్థానాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ దేశంలోనే 'సి-సెక్షన్ రాజధాని'గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తెలంగాణలో అత్యధికంగా 62.2 శాతం సిజేరియన్ రేటు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ 52.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 46.9 శాతం నమోదు కాగా, కర్ణాటకలో అత్యంత వేగంగా పెరుగుతూ 45.7 శాతానికి చేరింది. కేరళలో ఈ రేటు 41.3 శాతంగా నమోదైంది.












Click it and Unblock the Notifications